రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ప్రాణ నష్టంతో పాటు అపారమైన ఆస్తినష్టం జరిగింది. అయితే మునుపటి లాగా కాకుండా ఈసారి వచ్చిన విపత్తు కొన్ని ప్రశ్నలను తెర మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళితే..
మానవతా దృక్పథంతో స్పందించిన తెలుగు సినీ పరిశ్రమ:
ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విపత్తు సంభవించినా, తెలుగు సినీ పరిశ్రమ తన మానవతా దృక్పథాన్ని చాటుకుంటూనే ఉంది. ఈసారి కూడా పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు లు కోటి రూపాయల విరాళం ప్రకటిస్తే, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు కూడా తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. 1970 దశకంలో వచ్చిన దివిసీమ ఉప్పెన నాటినుండి మొన్నమొన్నటి హుదూద్, తిత్లీ సహా ప్రస్తుత విపత్తు వరకు ప్రతిసారి తెలుగు సినీ పరిశ్రమ భారీగా విరాళాలు అందజేస్తూ నే ఉంది.
సినీ పరిశ్రమా, అమ్మ లా పెంచితే అరకొర సహాయం చేస్తారా అంటూ ఆంధ్రజ్యోతి వ్యాసం :
ఆంధ్రజ్యోతి పత్రిక ఆ మధ్య – సినీ పరిశ్రమ కేవలం అరకొర విరాళాలతో సరి పెడుతోంది అంటూ పెద్ద వ్యాసాన్ని ప్రకటించింది. చిరంజీవి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు అని, నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షలు ప్రకటించారు అని చెబుతూనే ఇది అరకొర సహాయం అంటూ మూతి ముడిచింది. చిత్ర పరిశ్రమ తగినంత సహాయం చేయడం లేదంటూ దెప్పి పొడిచింది. గతంలో ఇదే తరహా కథనాలు- మరో రూపంలో సాక్షి, ఎన్టీవీ టీవీ5 లో కూడా వచ్చాయి. విపత్తులు వచ్చిన ప్రతిసారి, సినిమా వాళ్ళు విరాళాలు ప్రకటించే లోపే ఇలాంటి కథనాలు రాయడం కొన్ని మీడియా సంస్థలకు ఆనవాయితీగా మారింది.
సినిమా వాళ్ళు సరే, వారిపై నిందలు వేసే మీడియా సంస్థలు విరాళాలు ఇవ్వవా?
సినిమా వాళ్ళ వైపు వేలెత్తి చూపడానికి ముందుకు వచ్చే ఈ మీడియా సంస్థలు గత రెండు దశాబ్దాలలో వచ్చిన ఏ విపత్తు సమయంలో కూడా ధారాళంగా విరాళాలు ఇచ్చిన సందర్భాలు కనిపించడం లేదు. అయితే ఇందుకు ఈనాడు సంస్థలు మినహాయింపు. ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు దాదాపు 5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. గతంలో ఇతర రాష్ట్రాల భూకంపాలు వచ్చినప్పుడు, వారి ఇళ్ల నిర్మాణానికి సాయం చేశారు. శ్రీనిరాజు, రవి ప్రకాష్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ వారిని చీల్చిచెండాడిన టీవీ9 కూడా ఎప్పుడూ విరాళాలు ధారాళంగా ఇచ్చింది లేదు . అయితే ఇప్పుడు ఆ సంస్థ అధినేత ఉన్న మై హోమ్ రామేశ్వరరావు మాత్రం కోటిన్నర విరాళం ప్రకటించాడు.
వీటిని పక్కన పెడితే, ఏబీఎన్ ,సాక్షి, ఎన్ టి వి టీవీ5 మాత్రం విపత్తుల సమయంలో కూడా ప్రజలకు రూపాయి విదల్చవు కానీ, వాళ్లు విరాళం ఇవ్వలేదు వీళ్ళు విరాళాలు ఇవ్వలేదు అంటూ ప్రోగ్రామ్స్ చేసుకుని, ఆ ప్రోగ్రామ్స్ మధ్యలో కమర్షియల్ యాడ్స్ ప్రచారం చేసి డబ్బులు సంపాదించుకున్నాయి. గత అనేక సంవత్సరాల లో, వీరు నేరుగా ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు కానీ, అకౌంట్ నంబర్ ఇచ్చి ప్రజలను ఆ అకౌంట్ లోకి డబ్బులు వేయమని మాత్రం కొన్ని సార్లు చెప్పాయి. ఇలాంటి విపత్తు సమయంలోనే కాకుండా, కొన్ని ఇతర సందర్భాలలో కూడా అలా అకౌంట్ ఇచ్చి ప్రజలను డబ్బులు వేయమని చెప్పాయి. అయితే వీణ వాణి కోసం అలా సేకరించిన డబ్బులను కూడా ఏబీఎన్ ఛానల్ దుర్వినియోగం చేసిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఇక సాక్షి ఛానల్ తో పాటు, ఆ చానల్ అధినేత జగన్ కూడా నేరుగా తన జేబులో డబ్బులు ఎప్పుడూ విరాళాలు ప్రకటించిన సందర్భాలు లేవు. 2009 కంటే ముందు తొమ్మిది లక్షల ఆదాయం కలిగిన జగన్, అనతికాలంలోనే వందల కోట్ల అడ్వాన్స్ టాక్స్ చెల్లించే స్థాయికి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నప్పటికీ, తన స్థాయికి తగ్గట్టు ఎప్పుడు విరాళాలు ప్రకటించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తూ ఉంటారు. పాదయాత్రలో వృద్ధ మహిళ సహాయం అడిగినప్పుడు కూడా, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సహాయం చేస్తామని చెప్పారు తప్ప తన జేబులోంచి రూపాయి కూడా ఆయన సహాయం చేయలేదు అని వారు అంటుంటారు.
ఇక ntv tv 5 విషయానికి వస్తే, మీరు భూ ఆక్రమణలు చేశారంటే, మీరు అవినీతి చేశారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండే ఈ చానల్స్, విపత్తుల సమయంలో విరాళాల విషయానికి వస్తే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ ఉంటాయి. బహుశా వరద దృశ్యాలను ప్రజలకు చూపించడమే ప్రజలకు చేసిన పెద్ద సహాయం అని ఈ చానల్స్ భావిస్తున్నాయేమో తెలియదు.
మొత్తానికి ఈ మీడియా సంస్థలు ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయి. అధికార పార్టీ లకు కొమ్ము కాయడం లేదంటే నిజానిజాలు తో సంబంధం లేకుండా తమకు నచ్చిన పార్టీని మోయడం చేస్తున్నాయి తప్ప ప్రజలకు నిజాలు వివరించడం లేదు అన్న అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో వారు తమ వైపు నుండి ఎటువంటి సహాయం చేయకుండా, ఇప్పటికే సహాయం చేసిన వారిని మీరు చేసింది అరకొర సహాయం అంటూ నిందలు వేయడం ఆయా సంస్థల పట్ల ప్రజల్లో ఏవగింపు కలిగిస్తుంది అన్న విషయం వారు ఎప్పటికి తెలుసుకుంటారో వేచి చూడాలి