ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి, సీఎం దగ్గర ఎంతో పలుకుబడి ఉన్న అధికారిగా పేరున్న ప్రవీణ్ ప్రకాష్.. నిమ్మగడ్డ విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరించి.. చివరికి క్షమాపణలు చెప్పిన వైనం అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది. సోమవారం సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వద్ద జరిగే సమావేశానికి హాజరుకావాలని ఎస్ఈసీ రమేష్‌కుమార్‌కు లేఖ పంపారు. ఎన్నికలపై సమీక్ష చేయడానికి ఆ సమీక్ష పెట్టినట్లుగా లేఖ ఉంది. అధికారిక ప్రోటోకాల్ ప్రకారం… ఎస్ఈసీకి సంబంధించిన అంశాలపై ఇతరులు సమీక్ష చేయలేరు. కానీ.. ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి.. నేరుగా హాజరు కావాలని ఎస్ఈసీకే సందేశం పంపించారు.
దీనిపై ఎస్ఈసీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఏపీ ఎస్ఈసీ హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉంటారని.. ఆయనకు సంబంధించిన విధుల్లో సమావేశాలు పెట్టి.. ఆదేశాలు ఇవ్వడం న్యాయసమ్మతం కాదని రిప్లై ఇచ్చారు. ఈ విషయాన్ని న్యాయాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. తనకు తెలియకుండా సమావేశాలకు వెళ్లవద్దని.. తన కార్యదర్శిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఇది పెద్ద రగడకు కారణం అవుతోంది. ఎస్ఈసీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే అనే ఎదురు దెబ్బలు తిన్నది. చివరికి ఆయన విధుల్ని .. నియంత్రించేందుకు కొత్తగా ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధుల్ని హైజాక్ చేసే ప్రయత్నం ఏపీ సర్కార్ ప్రారంభించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల నిర్వహణ విషయంలో… ఇరవై ఎనిమిదో తేదీన రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ సమావేశం ఏర్పాటు చేశారు . అంత కంటే ముందుగానే.. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశం ఏర్పాటు చేసి నేరుగా ఎస్ఈసీనే హాజరు కావాలని ఆదేశించడం అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది. ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ సిద్ధపడితే ప్రభుత్వం సహకరించాల్సి ఉంటంది. లేకపోతే.. తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఒక వేళ ఎన్నికలకు ఆదేశిస్తే..ప్రభుత్వానికి ఇబ్బందికరం అవుతుంది. అందుకే ఎస్ఈసీ విధుల్ని సమావేశం పేరుతో హైజాక్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిరవరికి ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామనేసరికి..రమేష్‌కుమార్‌కు ప్రవీణ్ ప్రకాష్ ఫోన్ చేసి.. తప్పయిపోయిందని.. అది మీకు పంపాల్సిన సందేశం కాదని చెప్పినట్లుగా తెలుస్తోంది.అయితే రమేష్ కుమార్ మాత్రం.. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.,