ఐపీఎల్‌లో ప్రతీ ఆదివారం రోమాలు నిక్కబొడుచుకునే మ్యాచ్‌లు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆదివారం మాత్రం సాదాసీదా మ్యాచ్‌లో జరిగాయి. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ చేజింగ్ టీమ్‌లో విజయ సాధించాయి. స్కోర్ ఎంత అనే చూడకుండా… బ్యాట్స్‌మెన్లు ఎడాపెడా బాదేశారు. తమ జట్లకు విజయాలను అందించారు. ఈ క్రమంలో అలవోకగా సిక్సర్లు బాదేశారు. సెంచరీలు కొట్టేశారు.
తిరుగులేని విధంగా ఆడుతున్న ముంబైకు.. రాజస్థాన్ షాక్ ఇచ్చింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. ఇక గెలుపే తరువాయని రిలాక్సయిపోయింది. కానీ… అక్కడ బెన్ స్టోక్స్ సీన్ మార్చేశాడు. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుండి బాదుడే బాదుడు.. అరవై బంతుల్లోనే 107 పరుగులు చేసి గెలిచేదాకా ఔట్ కాకుండా నిలిచాడు. స్టోక్స్‌కు శాంసన్ తోడయ్యాడు. దీంతో.. 196 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ మరో పది బంతులు మిగిలి ఉండగానే సాధించేసింది. ముంబై 195 పరుగుల భారీ స్కోర్ చేయడంలో హార్దిక్ పాండ్యది కీలక పాత్ర. 21 బంతుల్లోనే అరవై పరుగులు చేశాడు.
అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లోనూ చేజింగ్ టీమ్‌నే విజయం వరించింది. బెంగళూరు జట్ట విధించిన 146 పరుగుల లక్ష్యాన్ని తడబడకుండానే చేధించారు. గత మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో .. స్వల్ప లక్ష్యమైనా .. చెన్నై గెలుస్తుందా.. లేదా అన్న ఆందోళన అభిమానుల్లో ఏర్పడింది. అయితే.. రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు గట్టిగా నిలబడటంతో విజయం సాకారమైంది. మంచి ఫామ్‌లో ఉన్న బెంగళూరు.. మొదట బ్యాటింగ్ ఎంచుకుని పరుగులు చేయడంలో ఇబ్బంది పడింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఆచితూచి ఆడారు. 15 ఓవర్ల తర్వతా ఆ జట్టు స్కోరు 101 మాత్రమే.