ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అధికారం చేపట్టి.. ఏడాదిన్నర దాటిపోయింది. ఈ లోపులో అమరావతి, పోలవరం కట్టేశారు. ఇప్పుడు విశాఖ మెట్రో కట్టడానికి టెండర్లు పిలవడానికి సిద్ధమవుతున్నారు. మంత్రుల ప్రకటనలు ఇలానే ఉన్నాయి. మెట్రో రైల్ కార్యాలయాన్ని హడావుడిగా విజయవాడ నుంచి విశాఖకు తరలించిన మంత్రి బొత్స… అట్టహాసంగా దసరా రోజు కార్యాలయాన్ని ప్రారంభించేశారు. ఇదిగో ఇక మెట్రో కట్టడమే ఆలస్యం అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచేస్తున్నామని స్పష్టం చేశారు. మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నదానిపై మాత్రం సౌండ్ లేదు. విభజన చట్టంలో ఉందని.. కేంద్రమే నిర్మించాలని ఆయన అంటున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ ,రాజధాని కూడా విభజన చట్టంలో ఉన్నాయన్న సంగతి బొత్సకు గుర్తుందో లేదో కానీ.. ఆయన కట్టేయడమే మిగిలిందని చెబుతున్నారు. విశాఖ, విజయవాడలకు మెట్రోలను కేంద్రం మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం ఎంత పోరాడినా ప్రయోజనం లేకపోయింది. సొంత నిధులతో అయినా నిర్మించడానికి ముందడుగు వేసింది. మెట్రో మ్యాన్ శ్రీధరన్‌కు డీపీఆర్ బాధ్యతలు ఇచ్చింది. విశాఖ మెట్రోకు సంబంధించి గత ప్రభుత్వమే డీపీఆర్‌ల పని పూర్తి చేసింది. అయితే కొత్త ప్రభుత్వం ఆ ప్రయత్నాలన్నింటినీ చెత్తబుట్టలో వేసింది. ఫిబ్రవరిలో విశాఖలోని మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ ల రూపకల్పన కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందనేది.
హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభమైన రోజున విశాఖలో 79.9 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం కోసం కొత్త డీపీఆర్ రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్ , రైట్స్ , యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం అన్నీ ఉన్నాయి.. ఒక్క మెట్రో వేస్తే సరిపోతుందని.. జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. దాని ప్రకారం.. ఫిబ్రవరిలో ఉత్తర్వులిచ్చారు. కేంద్రం పెట్టుబడిగా పెట్టినా …. హైదరాబాద్ మెట్రో డీపీఆర్ స్టేజ్ నుంచి ప్రారంభం కావడానికి పదేళ్లు పట్టింది. అలా చూస్తే.. విశాఖ మెట్రో పునాదులు కూడా పడే అవకాశం కష్టంగానే కనిపిస్తోందనేది.. ఇండస్ట్రీ వర్గాల అంచనా.