ఓ సామాన్యుడు. ఫ్లైట్ టికెట్ కూడా కొనడానికి డబ్బుల్లేని వాడు, ఏకంగా.. విమానాల వ్యాపారమే పెడతానంటే..? పెట్టి చూపిస్తే..? ఈ వ్యాపారంలో దిగ్గజాలుగా చలామణీ అవుతున్న ఎందరినో తన వ్యూహాలతో కుదేలు చేస్తే..? ఇవన్నీ చదువుకోవడానికి ఎంత బాగుంటాయో కదూ. కానీ.. ఇది కల కాదు. నిజం. నిజంగా జరిగిన అద్భుతం. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. సూర్య కథానాయకుడు. సుధా కొంగర దర్శకత్వం వహించారు. నవంబరు 12న ఈ చిత్రాన్ని అమేజాన్ప్రైమ్లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది.
ట్రైలర్ ఉద్వేగ భరితంగా ఉంది. ఓ సామాన్యుడు తన కలల్ని ఎలా సాధించాడో రోమాంఛితంగా తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. చాలా స్ఫూర్తివంతమైన కథ ఇది. దాన్ని అంతే బాగా తెరకెక్కించారన్న నమ్మకం కలుగుతోంది. మోహన్ బాబు ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సూర్య పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పాడు. ట్రైలర్ కట్ చేసిన విధానం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్.. అన్నీ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. సూర్య ఇటీవల చేసిన సినిమాలేవీ మంచి ఫలితాల్ని తీసుకురాలేదు. వరుస పరాజయాలకు ఈ సినిమా బ్రేక్ వేస్తే… సూర్య మళ్లీ ట్రాక్ లో పడినట్టే.