భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో తాము గెలుచుకోగలిగిన ఎనిమిది సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి రాజ్యసభకు ఎవరెవరు వెళ్లబోతున్నారన్నదానిపై విస్తృతమైన చర్చ ఢిల్లీలో జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారి కన్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒకరికి అవకాశం దక్కబోతోందన్న ప్రచారమే ఉద్ధృతంగా సాగింది. దానికి కారణం ఇటీవల పార్టీ పదవుల నుంచి ఉద్వాసనకు గురైన రామ్‌మాధవ్, మురళీధర్ రావు లాంటి వారితో పాటు… రాజ్యసభ హామీతో ఆ పార్టీలో చేరిన గరికపాటి మోహన్ రావు లాంటి వాళ్లు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. రామ్‌మాధవ్, మురళీధర్ రావులను కేబినెట్లోకి తీసుకుంటారని.. వారిని పార్టీ పదవుల నుంచి గెంటేసిన సమయంలో బీజేపీ వైపు నుంచి ప్రచారం జరిగింది.
ఆ దిశగా ఈ ముగ్గురిలో ఒకరుయూపీ నుంచి రాజ్యసభకు వెళ్లడం ఖాయమనుకున్నారు. ఓ దశలో.. గరికపాటి మోహన్ రావు పేరు ఖరారయిందని కూడా చెప్పుకున్నారు. కానీ.. లిస్ట్ రిలీజయిన తర్వాత.. ఎవరిలోనూ ఉత్సాహం లేకుండా పోయింది. ఎవరికీ … యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని బీజేపీ హైకమాండ్ కల్పించలేదు. గతంలో జీవీఎల్ నరసింహారావును యూపీ కోటా నుంచే రాజ్యసభకు పంపారు. అలాగే అవకాశం ఇస్తుందని భావించారు. అయితే.. త్వరలో జరగనున్న యూపీ ఎన్నికలపైనే ఎక్కువగా బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. సామాజిక సమీకరణాలన్నింటినీ కవర్ చేసుకుని.. తమ పార్టీకి ఆయువు పట్టుగా ఉంటున్న బ్రాహ్మణ సామాజికవర్గానికి పెద్ద పీట వేసింది. కేంద్రమంత్రి హర్దిప్ పురికి సీటిచ్చింది. తెలుగు వారికి నిరాశే ఎదురయింది. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో… రామ్ మాధవ్, మురళీధర్ రావుల్లో ఎవరికీ చోటు ఉండకపోవచ్చని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
అయితే.. కర్ణాటకలో ఓ రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది. సిట్టింగ్ ఎంపీ కరోనాతో చనిపోయారు. కానీ.. కర్ణాటకలో కూడా లోకల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ తెలుగు వారికి చాన్సిస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఇక తెలుగువారికి రాజ్యసభ సీట్లు.. మంత్రి పదవులు ఇప్పుడల్లా అందవని అర్థమవుతోంది. రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే.. తెలుగువారు బీజేపీ హైకమాండ్‌కు గుర్తుకు వస్తారని నిష్టూరాలు వినిపిస్తున్నాయి.