అప్పుడెప్పుడో మొదలెట్టి ఆపేసిన `నర్తన శాల` ఏటీటీ పుణ్యమా అని బయటకు రావడం నందమూరి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. సినిమా ఎలా వుంది? టికెట్ ధర 50 రూపాయలు గిట్టుబాటు అయ్యిందా, లేదా? అనే విషయాలు పక్కన పెడితే, మొదలెట్టి ఆపేసిన సినిమాని ఏదో విధంగా జనాలకు చూపించామన్న తృప్తి బాలయ్యకు, బాలయ్య దర్శకత్వ ప్రతిభ ఎంతో కొంత చూశామన్న ఆనందం నందమూరి అభిమానులకు కలిగాయి. అంతేనా..? ఈ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానన్న బాలయ్య దానికి సోషల్ కాజ్కూడా జోడించి – `నర్తన శాల` ఫుటేజీకి ఓ పరమార్థం ఇవ్వగలిగాడు.
అయితే… బాలయ్య కు ఇప్పుడు `నర్తన శాల`పై మళ్లీ ఫోకస్పెట్టాలన్న ఆలోచనలు పెరుగుతున్నాయని టాక్. `దేవుడు అనుగ్రహిస్తే.. నర్తన శాల తప్పకుండా తీస్తా` అని ఇటీవలే బాలయ్య చెప్పుకొచ్చాడు. ఆ మాటని జనాలు సీరియస్‌గా తీసుకున్నారో, లేదో తెలీదు గానీ, బాలయ్య మాత్రం సీరియస్‌గానే చెప్పాడట. పౌరాణికాలపై తెలుగు ప్రేక్షకులకు ఇంకా ప్రేమ ఉందన్నది బాలయ్య నమ్మకం. అయితే ఆ జోనర్ తీసే నాథుడే లేడు. అప్పుడప్పుడూ పౌరాణికాల రుచి చూపించాలంటే బాలయ్య లాంటి వాళ్లు సిద్ధం అవ్వాల్సిందే. పైగా `నర్తనశాల` అన్నది బాలయ్య కల. ఆ స్క్రిప్టు ఇంకా బాలయ్య దగ్గరే ఉంది. కాబట్టి.. స్క్రిప్టు విషయంలో పెద్దగా హైరానా పడాల్సింది లేదు. నటీనటుల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని, అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగితే.. తప్పకుండా ఆ సినిమాకంటూ ఓ క్రేజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మల్టీస్టారర్ల హవా ఎక్కువగా నడుస్తోంది. ఎవరినో ఎందుకు.. నందమూరి హీరోలనే తీసుకుని, వాళ్లకు కీలకమైన పాత్రలు అప్పగిస్తే.. బాగానే ఉంటుంది. బాలయ్య దృష్టిలో ఆలోచనలు ఉన్నట్టు వినికిడి. ఇది వరకంటే ద్రౌపదిగా ఎవరిని తీసుకోవాలన్న మీమాంసలో ఈ సినిమాని ఆపేశారు. ఇప్పుడు ఆ పాత్రకీ ఆప్షన్లున్నాయి. కాబట్టి… బాలయ్య ఫోకస్ `నర్తనశాల`పై పడి, ఆయన ఈ సినిమాని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.