ఈమధ్య మలయాళం డబ్బింగుల్ని ఎక్కువగా నమ్ముకొంది `ఆహా`. వరుసగా మలయాళం డబ్బింగులే వస్తోంటే… `ఆహా`లో డబ్బింగులు మాత్రమే వస్తాయా? అంటూ సెటైర్లు కూడా వేసుకున్నారు సినీ అభిమానులు. కానీ చిన్న సినిమాల్ని కొనే ధైర్యం చేసింది. `ఒరేయ్ బుజ్జిగా,` `కలర్‌ఫొటో` ఈమధ్య ఆహాలోనే విడుదలయ్యాయి. `ఒరేయ్ బుజ్జిగా` విమర్శకుల్ని మెప్పించలేదు. ప్రేక్షకులూ.. ఈ సినిమాకి అత్తెసరు మార్కులే ఇచ్చారు. కానీ… `ఆహా`కి మాత్రం ఈ సినిమా వల్ల లాభమే జరిగింది. ఈసినిమాతో కొత్తగా 50 వేల మంది ఆహా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఓ ఓటీటీకి ఓ చిన్న సినిమా వల్ల ఇంత మంది కొత్త సబ్ స్క్రైబర్లు వచ్చారంటే గ్రేటే. ఆ లెక్కన `ఆహా`కి సంబంధించినంత వరకూ బుజ్జిగాడు ప్లస్ అయ్యాడు.
మొన్నటికి మొన్న `కలర్‌ఫొటో` అనే మరో చిన్న సినిమా విడుదలైంది. ఈ సినిమాని ఏకంగా 3.5 కోట్లు పెట్టి కొనేసింది ఆహా. ఆ సినిమాకి అది ఎక్కువ రేటే. కాకపోతే.. `ఆహా` లో ఇప్పటి వరకూ విడుదలైన సినిమాలూ, వెబ్ సిరీస్‌లలో అత్యధిక వ్యూవర్ షిప్ సాధించిన సినిమాగా `కలర్‌ఫొటో` నిలిచింది. ఇటీవల ఓటీటీలో ఏ సినిమాకీ రాని వ్యూవర్ షిప్ ఇది. `ఆహా` టీమ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమాతో కొత్తగా 15 వేలమంది సబ్ స్క్రైబర్లు యాడ్ అయ్యార్ట. దాదాపు 16 మిలియన్ మినిట్స్ కౌంట్ వచ్చిందట. చిన్న సినిమాకి ఇది విశేషమైన స్పందనే.