హైదరాబాద్: నారాయణఖేడ్ ఉపఎన్నికలో ఊహించినట్లే టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. ఓట్ల లెక్కింపు కొద్ది సేపటిక్రితం ముగిసింది. టీఆర్ఎస్ 53,625 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. అధికార పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డికి 93,076 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 39,451 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థి విజయపాల్రెడ్డికి డిపాజిట్ దక్కలేదు. కేవలం 14,787 ఓట్లు మాత్రమే దక్కాయి. విజయంపై తెలంగాణ భవన్ వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించినందుకుగానూ భారీ నీటిపారుదలశాఖమంత్రి హరీష్ రావును, పార్టీ శ్రేణులను ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఈ ఉపఎన్నికలో పోల్ మేనేజిమెంట్ మొత్తం హరీష్ రావే చూసుకున్న సంగతి తెలిసిందే.
డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి నారాయణఖేడ్ ఉపఎన్నిక ఫలితంపై తెలంగాణ భవన్లో స్పందిస్తూ, ఈ నియోజకవర్గం మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని, అటువంటి చోట జీరో నుంచి మొదలుపెట్టి 53,625 ఓట్ల మెజారిటీ సాధించటం అనూహ్య విజయమని చెప్పారు. నారాయణఖేడ్ నియోజకవర్గం అంటే పేదరికానికి, అమాయకత్వానికి మారుపేరని అన్నారు. ఈ నియోజకవర్గాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాబోయే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే విజయాన్ని పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ వలనే సాధ్యమవుతున్నాయని చెప్పారు.