అమరావతి రాజధానిలోనే ఉండాలి కానీ…రోడ్డెక్కం..! ఉద్యమం చేస్తామన్న జనసేన లాంటి నేతల్నీ అడ్డుకుంటాం..! పైగా.. అమరావతి మహిళలపై అసభ్య విమర్శలూ చేస్తాం..!.. ఇదీ ఏపీ రాజధానిపై బీజేపీ వైఖరి. ప్రస్తుతం పోలవరం విషయంలోనూ అదే వైఖరిని బీజేపీ అవలంభిస్తోంది. పోలవరం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.. కట్టి చూపిస్తాం.. మొత్తం క్రెడిట్ బీజేపీకి వస్తుందనే విమర్శలు చేస్తున్నారు అంటూ.. ప్రకటనలు చేస్తున్నారు.. కానీ కేంద్రం వైపు నుంచి తీసుకుంటున్న నిర్ణయాలపై మాత్రం మాట్లాడటం లేదు. పోలవరంను పూర్తి చేస్తామని గొప్పలు చెబుతున్నారు. ఎలా పూర్తి చేస్తారో మాత్రం చెప్పడం లేదు. అమరావతి, పోలవరం రెండూ.. తమకు ప్రయారిటీ అని మాటల్లో చెబుతున్నారు. కానీ.. వాటి చావుబతుకుల్లోకి వెళ్లిపోతూంటే.. చూస్తూ ఉంటున్నారు. కనీసం.. వాటిని కాపాడేందుకు.. ప్రయత్నించడం లేదు.
పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కార్ను దారుణంగా వంచిస్తోంది. ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్ట్ అంటే… డ్యాం కాదు. ఏ అర్థంలో తీసుకున్నా. ప్రాజెక్ట్ అంటే.. కట్టే డ్యాం.. ఆ డ్యాంలో నిలబడే నీరు ఎక్కడి వరకూ ఉంటుంది. అక్కడ ఏ యే ప్రాంతాలు మునిగిపోతాయో గుర్తించి.. నిర్వాసితులందరికీ.. చిట్ట చివరి నిర్వాసితునికి పరిహారం ఇచ్చి ఖాళీ చేయించి.. డ్యాంలో నీరు నింపితేనే ప్రాజెక్ట్ పూర్తయినట్లు. కానీ ఇక్కడ పోలవరం విషయంలో కేంద్రం దారుణంగా వంచించింది. ఇరిగేషన్ కాంపోనెంట్ కు మాత్రమే డబ్బు ఇస్తామని చెబుతోంది. నిర్వాసితులకు పరిహారం తమ బాధ్యత కాదని అంటోంది. అంటే… డ్యాం కట్టినా నీళ్లు నిలపడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇక ప్రాజెక్ట్ అవసరం ఏముంటుంది..?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు.. తమ రాష్ట్ర ప్రజల్ని బకరాలను చేయడానికి సిద్ధపడుతున్నారు కానీ.. తాము మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం నోరెత్తడానికి సిద్ధపడటం లేదు. సోము వీర్రాజు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి వరకూ అందరిదీ ఒకే మాట. ఏపీకి కేంద్రం అన్నీ చేస్తోందన్నదే. వైసీపీ, టీడీపీ ఏమీ చేయడం లేదనే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పన్నుల్లో వాటాలు కూడా ఎగ్గొట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. కేంద్రం ఏమిచ్చిందో.. ఏమి తీసుకుందో.. బీజేపీ నేతలు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. నోరు తెరవలేకపోతున్న వైసీపీ నిస్సహాయతను ఆసరాగా చేసుకుని.. ప్రజల్ని తమదైన శైలిలో మభ్యపెడుతున్నారు.