తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న విజయశాంతి మళ్లీ బీజేపీలోకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. విజయశాంతి వైపు నుంచి సానుకూల సంకేతాలు రాకపోతే… కిషన్ రెడ్డి అలా వెళ్లి ఆహ్వానించే అవకాశం లేదు. అందుకే.. విజయశాంతి పార్టీ మార్పు ఖాయమని తెలంగాణ రాజకీయవర్గాలు నిర్ణయానికి వచ్చాయి. విజయశాంతి గతంలో తెలంగాణ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని సవాల్ చేశారు. దానికి అనుగుణంగా.. తెలంగాణ ప్రకటించగానే.. కేసీఆర్ .. తాను చెప్పినట్లుగా .. టీఆర్ఎస్ను విలీనం చేయకపోయినా.. తాను వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు.
మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి.. ఓడిపోయారు. ఐదేళ్లు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. మళ్లీ తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయానికి తెరమీదకొచ్చిన ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఆమె పేరు కూడా ఉంది. అయితే ఆమెకు ఎక్కడా టిక్కెట్ లభించలేదు. దాంతో .. ఆమె స్థాయికి తగ్గట్లుగా ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. హెలికాఫ్టర్ కూడా కేటాయించి ఆమెతో ప్రచారం చేయించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే.. ఆ తరవాత ఆమెకు ప్రాధాన్యం దక్కలేదు., పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు. దీంతో విజయశాంతి పెద్దగా ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు.
ఆమె అసంతృప్తిగా ఉన్నారని.. ఓ సారి ఉత్తమ్, కుంతియా ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారు. అయినా ఆమె సైలెంట్‌గానే ఉండిపోయారు. ఇప్పుడు.. కిషన్ రెడ్డి వెళ్లి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీజేపీకి వెళ్లడం ఖాయమైనట్లుగా భావించవచ్చు. మొదటగా.. బీజేపీలో చేరిన విజయశాంతి..ఆ తర్వాతా తల్లి తెలంగాణ పేరుతో పార్టీ పెట్టారు. టీఆర్ఎస్లో విలీనం చేశారు. కాంగ్రెస్‌లో చేరారు., ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి వెళ్తున్నారు.