అమెరికా ప్రపంచ శాంతిని కోరుకొంటుంది. అదే సమయంలో ప్రపంచ దేశాలకు అత్యాధునిక ఆయుధాలు అమ్ముతుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో శాంతి స్థాపన జరగాలంటే అది యుద్దాల ద్వారానే సాధ్యమని దాని నిశ్చితాభిప్రాయం. అందుకే పాకిస్తాన్ కి అత్యాధునికమైన ఎఫ్-16 యుద్ద విమానాలు అమ్ముతుంది. భారత్ కి 145ఎమ్-777 ఫిరంగులు అమ్ముతుంది.
భారత్ తో మరో యుద్ధం చేసి తమ సత్తా చాటుకోవాలని పాక్ ఆర్మీ అధికారులు చాలా కాలంగా తెగ ఉబలాటపడుతున్నారు. ఇప్పుడు వారి చేతిలో అణ్వాయుధాలు కూడా ఉన్నాయి కనుక ఓసారి వాటిని భారత్ పై ప్రయోగించి చూసుకోవాలని అనుకొంటున్నారు. వారికి ఇప్పుడు అత్యాదునికమయిన ఎఫ్-16 యుద్ద విమానాలు కూడా అమెరికా సమకూర్చిపెట్టింది. కేవలం పాకిస్తాన్ కే అన్ని ఆయుధాలు సమకూర్చుతూ ఉంటే భారత్ మళ్ళీ రష్యాకి దగ్గరవవచ్చుననే భయం కూడా ఉంది. కనుక భారత్ కోరినట్లుగా అత్యాధునిక 145ఎమ్-777 ఫిరంగులను సరఫరా చేయడానికి అంగీకరించింది. దాని కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖకు అంగీకార పత్రం కూడా అందజేసింది.
ఈ ఆయుధాల అమ్మకం ద్వారా అమెరికా $700 మిలియన్లు సంపాదించుకొంది. పాకిస్తాన్ నుంచి కూడా ఇంచుమించు అంతే మొత్తం సంపాదించుకొంటోంది. కాపిటలిస్ట్ దేశమయిన అమెరికా వ్యాపారం చేసి లాభాలు ఆర్జించుకోవాలనుకొంటే ఎవరికీ ఆక్షేపణ ఉండదు కానీ ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనే సాకుతో ప్రపంచ దేశాలకు అత్యాధునిక ఆయుధాలు అమ్ముకొంటూ వాటిని వినాశనంవైపు నడిపిస్తూ డబ్బు సంపాదించుకోవాలని అమెరికా తాపత్రయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
పఠాన్ కోట్ దాడి తరువాత భారత్-పాక్ మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తతలు గురించి అమెరికాకి బాగా తెలిసి ఉన్నప్పటికీ రెండు దేశాలని శాంతి చర్చలకు ప్రోత్సహించే ప్రయత్నం చేయకుండా రెంటికీ అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేసి డబ్బు సంపాదించుకొంటోంది. ఒకవేళ అమెరికా ఆయుధాలు ఇవ్వకపోతే భారత్, పాక్ దేశాలు మరో దేశం నుండయినా కొనుగోలు చేసుకొంటాయి కనుక అదేదో తనే అమ్ముకొంటే మంచిదని అమెరికా భావిస్తోందేమో?