కరోనా ఎంత పని చేసిందో? కరోనా వల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుదలలూ ఆగిపోయాయి. ఆఖరికి… ఓ సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశానికీ బ్రేకులు పడ్డాయి. ఆ స్టార్ మరెవరో కాదు.. రజనీకాంత్..
రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఎప్పుడా అంటూ ఏళ్లకు ఏళ్లుగా తమిళనాట సూపర్ స్టార్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. `అదిగో.. ఇదిగో` అని ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్.. మీటింగులు పెట్టి, అభిమానుల్ని సంప్రదించి కాస్త కాలయాపన చేసినా ఆశల్ని మాత్రం సజీవంగా ఉంచాడు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈసారి తలైవా.. ఎంట్రీ ఖాయం అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్న వేళ.. రజనీ రాజకీయాల్లోకి రావట్లేదన్న వార్త బయటకు వచ్చింది. రజనీ పేరిట.. ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఆరోగ్య సమస్యల రీత్యా తాను రాజకీయాల్లోకి రావడం లేదని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ స్థాపించి, జనం మధ్యలో తిరగడం సరి కాదని వైద్యులు సూచించిన మేర ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆ లేఖ సారాంశం. దానికి తోడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రజనీ ఇంకా పొలిటికల్ గా యాక్టీవ్ కాకపోవడంతో రజనీపొలిటికల్ ఎంట్రీ ఇక లేనట్టే అని అంతా ఫిక్సయిపోయారు.
నిజానికి ఆ లేఖకీ తనకీ ఎలాంటి సంబంధం లేదని, ఆ లేఖ తాను రాయలేదని రజనీ స్పష్టం చేశారు. కాకపోతే.. తన అనారోగ్యం నిజమే అని, ఇలాంటి పరిస్థితిల్లో బయట తిరగడం సరి కాదని, వైద్యులు సూచనలు ఇచ్చిన మాట కూడా నిజమే అని రజనీకాంత్ చెప్పుకొచ్చాడు. కాకపోతే.. పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఇప్పటికీ రజనీ ఏమీ తేల్చలేదు. ఆ లేఖ రజనీ రాసినా, రాకపోయినా ఒక్కటి మాత్రం నిజం. రజనీని కరోనా భయపెట్టింది. అనారోగ్య సమస్యలతో పాటు, కొత్తగా రాజకీయ సమస్యల్నీ తాను మోయలేనన్న నిర్దారణకు రజనీ వచ్చేశాడు. పైగా సూపర్ స్టార్లు రాజకీయాల్లో రాణించడం కష్టమన్న విషయాన్ని రజనీ గ్రహించాడు. తాను వచ్చినంత మాత్రన మార్పు సాధ్యం కాదన్న నిజాన్ని… రజనీ ముందే ఒప్పుకోగలిగాడు. అందుకే యుద్ధం ప్రారంభించక ముందే.. తెల్లజెండా ఊపేశాడు. రజనీ రాజకీయాల్లోకి రావడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది. దానికి కారణం కరోనానా.. లేదా ఓడిపోతానన్న భయమా అనేది పక్కన పెడితే – ఇన్నాళ్లుగా రజనీ వస్తాడని ఎదురు చూసిన అభిమానులకు మాత్రం ఇది మింగుడు పడని విషయం.