తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ మంత్రికి చెందిన వాట్సాప్ చాటింగ్‌లంటూ.. కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయితే అవి ఎంత వరకు నిజమో ఎవరికీ తెలియకపోడంతో.. పెద్దగా మీడియాలో హైలెట్ కాలేదు. కానీ అనూహ్యంగా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే టీవీ చానలే… ప్రభుత్వంలోని మంత్రి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా… సోషల్ మీడియాలో తిరుగుతున్నాయంటూ… బ్రేకింగ్‌లు వేసి హడావుడి ప్రారంభించారు. ఎక్కడా మంత్రి పేరు చెప్పడం లేదు.
కానీ తాము ప్రసారాలు ప్రారంభించేసరికి కరీంనగర్‌లో తమ టీవీ ప్రసారాలను నిలిపివేశారని ఆ చానల్ ప్రకటించుకుంది. దాంతో ఆ మంత్రి కరీంనగర్‌కు చెందిన వారని సులువుగానే అర్థమైపోతుంది. కాసేపు ప్రసారాలు చేసిన తరవాత .. వెంటనే ప్రభుత్వ స్పందన కూడా వచ్చిందని ఆ చానల్ ప్రకటించుకుంది. వాట్సాప్ చాటింగ్‌లో ఉన్నది ఎంత నిజమో తెలుసుకునేందుకు ప్రభుత్వ ఇంటలిజెన్స్ రంగంలోకి దిగిందని.. అందులో పేర్కొన్న హోటల్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సేకరించారని… మంత్రిపై ప్రభుత్వం సీరియస్ అయిందని.. డెవలప్‌మెంట్స్ ప్రకటించారు. అందే కాదు.. కరీంనగర్‌లో తమ టీవీ ప్రసారాలు మళ్లీ ప్రారంభమయ్యాయని కూడా చెప్పుకున్నారు. మొత్తానికి మంత్రిని టార్గెట్ చేశారనే గుసగసలు మాత్రం టీఆర్ఎస్‌లో ప్రారంభమయ్యాయి.
ఆ మంత్రి ఆ చాటింగ్ తనది కాదని చెప్పుకోలేడు. ఆ టీవీ చానల్ నేరుగా తన పేరు చెబితే.. ఖడించడమో.. మరొకటో చేసేవాడు. ఎవరి పేరు చెప్పనందున… తాను భుజాలు తడుముకోలేడు. అలా అని ఎవరికీ తెలియదా అంటే.. ఆయనే అని అందరికీ తెలిసిపోయింది. చివరికి… తెలంగాణలో మంత్రివర్గంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే.. ఓ రిమార్కులా ఆయన పేరు పక్కన ఈ వివాదం ఉండిపోతుంది. దాని వల్ల లాభపడేవారు ఎవరో మరి..!