సన్రైజ్ ఏపీ పేరుతో గత ప్రభుత్వం విశాఖలో ప్రతీ ఏటా పెట్టుబడుల సదస్సు నిర్వహించింది. పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించి ఎంవోయూలు చేసుకునేది. అలా చేసుకున్న ఎంవోయూలలో ఒక్కటి కూడా పెట్టుబడిగా మారలేదని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఆ పెట్టుబడుల సదస్సులన్నీ బోగస్ అని.. ప్రజాధనం ఖర్చు చేయడానికేనని మండి పడుతూ ఉంటారు. అయితే… టీడీపీ మాత్రం.. తమ హయాంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులన్నీ.. ఆ సదస్సుల ద్వారానే వచ్చాయని చెబుతూ ఉంటారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో పెట్టుబడుల సదస్సు.. ఇతర మార్గాల ద్వారా రూ.16 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి.
వాటిలో రూ.5లక్షల కోట్ల పెట్టుబడులు ఉత్పాదక దశకు వచ్చాయి. ఇప్పటికే వచ్చిన వాటివల్ల 5.5 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వ మంత్రులు శాసనమండలిలో ఇచ్చిన సమాధానంలో ఈ విషయం ఉంది. అయితే.. అధికారికంగా ఎలా ఉన్నా.. రాజకీయంగా మాత్రం.. రూపాయి పెట్టుబడి రాలేదు.. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శిస్తూ ఉంటారు. అలా అంటూ ఉంటారు కాబట్టే… అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా.. పెట్టుబడుల సదస్సు గురించి ఆలోచించలేదు.
అయితే.. ఏపీని పారిశ్రామికంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో ఉన్న మంత్రి గౌతంరెడ్డి.. మళ్లీ పెట్టుబడుల సదస్సు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో పెట్టుబడుల ఆకర్షణకు గ్లోబల్ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో సన్ రైజ్ స్టేట్ పేరుతో సదస్సు నిర్వహించగా.. ఈ సారి ఏపీ పునరుజ్జీవ గ్లోబల్ సమ్మిట్ పేరుతో దీన్ని నిర్వహించనున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ దీని కోసం సహకరించనుంది.