దుబాయ్ శీను సినిమాలో ముంబైలో ఉండే పట్నాయక్ రవితేజ అండ్ గ్యాంగ్‌ని ఎలా బకరాని చేస్తారో చాలా సార్లు చూశాం. వారికివ్వాల్సిన డబ్బుల్ని ఎన్ని రకాలుగా కోత పెట్టి చివరికి మీరే బాకీ ఉన్నారని తేల్చేశాడు పట్నాయక్ కృష్ణభగవాన్. అచ్చంగా అదే పట్నాయక్ క్యారెక్టర్ని.. పోలవరం నిధుల విషయంలో కేంద్రం దింపేస్తోంది. రూ. 55వేల కోట్ల నిధుల నుంచి రకరకాల కారణాలు చెబుతూ.. రూ. 20వేల కోట్లకు తీసుకొచ్చిన కేంద్రం .. ఇప్పుడు.. వాటిలో తాగునీటికి… విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఎమైనా నిధులుంటే మినహాయించాలని నిర్ణయించింది. దీంతో మరింతగా నిధులకు కోత పడే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చిన లేఖతో ఏపీ అధికారులకు మరోసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
రూ. 55 వేల కోట్ల నుంచి రూ. 20వేల కోట్లకు తగ్గింపు..!
ఏపీ ప్రభుత్వ పెద్దల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని పోలవరం విషయంలో కేంద్రం ఓ ఆట ఆడుకుంటోంది. పార్లమెంట్లో స్వయంగా కేంద్ర మంత్రి పోలవరం సాంకేతిక అంచనాలను రూ. 55వేల కోట్లకు ఆమోదించామని ప్రకటించిన తర్వాత ఇప్పుడు మాట మార్చారు. అనేక రకాలుగా పోలవరం నిధులకు కోత పెడుతూ వస్తున్నారు. చివరికి 2013-14 నాటి ధరల ప్రకారం రూ. 20398 కోట్లు ఇస్తామంటూ తేల్చేశారు. ఇందులోనూ “ఇరిగేషన్ కాంపొనెంట్” అనే పదాన్ని చేర్చారు. ఇరిగేషన్ కాంపొనెంట్ అంటే… ఒక్క సాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును మాత్రమే ఇస్తారు. తాగునీటి కోసం.. విద్యుత్ కేంద్రం కోసం పెట్టే ఖర్చును ఇవ్వరు. అది ఏపీ సర్కారే భరించాలి.
ఇప్పుడు మళ్లీ అందులో మరికొంత తగ్గింపు..!
ప్రస్తుతం ఏపీ సర్కార్‌కు రూ. 2200 కోట్లకుపైగా కేంద్రం రీఎంబర్స్ చేయాల్సి ఉంది. ఆ నిధులను .. తాము కొత్తగా చెప్పిన రూ. 20వేల కోట్లకు అంగీకరిస్తేనే ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఇప్పుడు ఆ రూ. 2200 కోట్లలో.. తాగునీటి విభాగం కోసం ఏమనా ఖర్చు చేశారా..? విద్యుత్ కేంద్రం కోసం ఏమైనా ఖర్చు చేశారా..? అన్న లెక్కలను కేంద్రం బయటకు తీస్తోంది. వాటి కోసం పెట్టిన ఖర్చు ఉంటే… వాటిని మినహాయిస్తారు. దాని ప్రకారం.. ఆ నిధుల్లో మరికొన్ని వందల కోట్లు లోటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అవైనా విడుదల చేస్తారా.. అంటే… ఇంకెన్ని కొర్రీలు పెడతారో అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. చివరికి ఏపీనే ఇంకా తిరిగి ఇవ్వాలన్న లేఖ వచ్చినా ఆశ్చర్యం లేదని అధికారులు సెటైర్లు వేసుకుంటున్నారు.
మొత్తం అస్థిత్వానికే ప్రమాదం..!
ఇంత జరుగుతున్నా.. బీజేపీ పైనా.. కేంద్రంపైనా నోరెత్తే సాహసాన్ని జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. ఇది మరింత అలుసుగా మారింది. రాజకీయ పరంగా… టీడీపీపై నిందలేసి.. కాలం గడిపేస్తున్నారు. ఏపీలో రెండు పార్టీలు.. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ కాలం గడిపేస్తాయని.. ఏపీకి ఏ సాయమూ చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి కేంద్రం వెళ్లిపోతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కసికట్టుగా పని చేసే ఉద్దేశంలో ఎవరూ లేరు. అంతిమంగా నష్టపోతోంది ప్రజలే.