ఈ కరోనా సమయంలో.. సోనూసూద్ రియల్ హీరో అయిపోయాడు. హీరోలకూ, రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు, సంస్థలకు ధీటుగా – సేవలు అందించాడు. తన యావదాస్తినీ దాన ధర్మాలకు ఖర్చు పెట్టేస్తున్నాడా? అనేంతగా స్పందించాడు. దాంతో సోనూ పేరిట అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. సోనూని వేనోళ్ల పొగడడం ప్రారంభించారు.
క్రమంగా సోనూ ఇమేజ్ మారింది. ఎప్పుడైతే ఓ నటుడిపై జనాలకు అభిమానం పెరగడం ప్రారంభం అవుతుందో, ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని చిత్రసీమ ఆరాటపడుతుంది. అది సహజం. అందుకే… సోనూ కి అవకాశాలు వెల్లువలా రావడం మొదలైంది. దాంతో సోనూ కూడా రేటు పెంచేశాడు. ఇప్పుడు రోజుకి 20 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. సోనూని పెట్టుకుంటే… కనీసం 15 – 20 రోజుల షూటింగైనా చేయాలి. అంటే.. సినిమాకొచ్చి దాదాపు 4 కోట్లన్నమాట. అయితే… మిగిలిన ఖర్చులు అదనం. సోనూ డబ్బింగ్ చెప్పుకోడు. అయ్యప్ప శర్మలాంటి వాడ్ని తీసుకొచ్చి.. డబ్బింగ్ చెప్పించాలి. దానికి మరో 10 లక్షలు అదనం. అయినా సరే, సోనూనే కావాలని దర్శకులు, నిర్మాతలు వెంట పడుతున్నారు. ఇటీవల ఓ బడా హీరో సినిమా కోసం సోనూని సంప్రదిస్తే.. కాల్షీట్లు చూసి, 5 కోట్లు అడిగాడట. నిర్మాతేమో.. 1.25 కోట్ల దగ్గర ఆగిపోయాడని సమాచారం. దాంతో సోనూ ఆ సినిమా చేయనని చెప్పేశాడట. ఇదీ.. సోనూకి టాలీవుడ్ లో ఉన్న డిమాండ్.