తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కేంద్రంగా కేంద్రప్రభుత్వంపై సమరభేరీ మోగించారు. జనగామ జిల్లాలో రైతు వేదికను ప్రారంభించిన కేసీఆర్… కేంద్రం రైతుల్ని దగా చేస్తుందని చెప్పడానికి తనదైన లాంగ్వేజ్ ఎంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా అయితే సవాళ్లతో.. లాజిక్కులతో ప్రసంగాలు చేసేవారో.. అచ్చంగా అలాగే.. రైతు కేంద్రంగా రాజకీయం ప్రారంభించారు. కేంద్రం వ్యవసాయ బిల్లులను అడ్డగోలుగా పాస్ చేసిందని..ఢిల్లీ రైతు తెలంగాణకు వచ్చి అమ్ముకుంటాడా.. అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని .. రావణాసురుడికి బదులు మోదీ బొమ్మలు తగులబెడుతున్నారని వివరించారు. మనం కూడా పిడికిలి బిగించాలని రైతులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు ..కళ్లు తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదని …కానీ తెలంగాణ సర్కార్ మాత్రం గ్రామాలకే వచ్చి కొనుగోలు చేస్తోందన్నారు. రైతు వేదిక ఒక ఆటం బాంబ్.. అద్భుతమైన శక్తిగా కేసీఆర్ అభివర్ణించారు. ఏ పంట వస్తే లాభమో రైతు వేదికలే నిర్ణయించాలన్నారు. 95శాతం రైతు వేదికలు ఇప్పటికే పూర్తయ్యాయని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రైతుల నిరసనలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. అయితే అవి జరుగుతూనే ఉంటాయని చెప్పుకొచ్చారు. అమెరికా, యూరప్‌లో కూడా రైతులు నిరసనలు తెలియజేస్తూనే ఉంటారన్నారు.
దుబ్బాక ఎన్నికలపైనా కేసీఆర్ తన ప్రసంగంలో స్పందించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు. బీజేపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 38 లక్షల 64వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంటే.. కేంద్రం కేవలం 7 లక్షల మందికి రూ.200 మాత్రమే ఇస్తోందని.. తాను చెప్పేది అబద్దం అయితే తక్షణం రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. రైతు వేదికల కేంద్రంగా కేసీఆర్… కేంద్రంపై దండెత్తినట్లుగానే రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్ వ్యవసాయ సమస్యలనే హైలెట్ చేసుకుంటారని.. వ్యవసాయానికి తాము తెలంగాణ తీసుకున్న చర్యలనే .. హైలెట్ చేస్తారని భావిస్తున్నారు.