గెలిస్తే తప్ప ప్లే ఆఫ్‌కి చేరుకోని పక్షంలో… హైదరాబాద్ డెక్కన్ ఛార్జెస్ విజృంభించింది. అన్ని.. రంగాల్లోనూ ఆధిప్యతం చెలాయిస్తూ.. ఈ ఐపీఎల్ లో నెంబర్ వన్ జట్టయిన ముంబైని 10 వికెట్ల తేడాతో ఓడించి… ఘన విజయంతో ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ ఓడిపోతే.. ప్లే ఆఫ్‌కి వెళ్దామన్న కొలకొత్తా ఆశలకు గండి కొట్టింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు తరవాత… ప్లే ఆఫ్‌లో అడుగు పెట్టిన నాలుగో జట్టు… హైదరాబాద్.
ఈరోజు.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి.. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది వార్నర్ సేన. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, హైదరాబాద్ కి 150 పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసింది ముంబై. బుమ్రా లేని ముంబై బౌలింగ్ మరింత బలహీనంగా మారిపోవడంతో.. ఏ దశలోనూ హైదరాబాద్ తడబడలేదు.150 పరుగుల లక్ష్యాన్ని మరో 17 బంతులు మిగిలి ఉండగానే.. వికెట్ కోల్పోకుండా అందుకుంది. వార్నర్ 58 బంతుల్లో 85 పరుగులు, సాహా 45 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. వికెట్ పడకుండా తమ జట్టుని ప్లే ఆఫ్‌కి చేర్చారు. ముంబై పై పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకోవడం.. హైదరాబాద్ కి ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌తో ప్లే ఆఫ్ లెక్కలు తేలిపోయాయి. తొలి మ్యాచ్‌లో… ముంబై, ఢిల్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి చేరుకుంటుంది. రెండో మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుతో ఆడుతుంది. అందులో గెలిస్తే.. ఫైనల్ కి చేరుతుంది.