నటుడు రాజశేఖర్ కరోనా బారీన పడి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. `అలాంటిదేం లేదు`అంటూ కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. నిజానికి రాజశేఖర్ పరిస్థితి ఓ దశలో మరీ క్లిష్టంగా మారిందని, అయితే వైద్యుల సహకారంతో ఆయన కోలుకున్నారని జీవిత తెలిపారు. “ఓ దశలో ఆయన పరిస్థితి చూసి మేమంతా భయపడిపోయాం. భగవంతుడి దయ వల్ల గండం గట్టెక్కింది. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. కృత్రిమ పరికరాల ద్వారా కాకుండా సహజంగానే శ్వాస తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేస్తారు“ అని జీవిత తెలిపారు. రాజశేఖర్ ఇంటి సభ్యులందరికీ కరోనా సోకింది. అయితే రాజశేఖర్ మినహా అంతా త్వరగానే కోలుకున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల రాజశేఖర్ తేరుకోవడం కష్టమైంది. ఏదైతేనేం.. ఇప్పుడు ఆయన కోలుకున్నారు. త్వరలోనే డిశ్చార్జ్ అవ్వబోతున్నారు.