రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర్నుంచి చోటా బీజేపీ నేత వరకూ స్పందించారు . అందరూ ఖండించారు. మహారాష్ట్రలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం ఉందని అందరూ మండిపడ్డారు. ఈ స్పందనలు చూసి..సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్ నడుస్తోంది. ఆర్నాబ్ గోస్వామి జర్నలిస్టా లేకపోతే.. బీజేపీ నేతా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా జర్నలిస్టు అనే వారిపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడితే అటు మీడియా ప్రపంచం మొత్తం.. ఇటు రాజకీయ నేతలు అందరూ మద్దతుగా నిలుస్తారు. కానీ ఆర్నాబ్ విషయంలో బీజేపీ నేతలు తప్ప ఏ ఒక్కరూ మద్దతుగా స్పందించలేదు.
జర్నలిజంలో ఆర్నాబ్ స్టైల్ వేరు. చాలా మంది మీడియాలో తాము సపోర్ట్ ఇవ్వాలనుకున్న పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తారు. కానీ ఇతర పార్టీల పట్ల అనుచితమైన వార్తా కథనాలు .. అభ్యంతరకమైన భాషను వినియోగించరు. కానీ ఆర్నాబ్ మాత్రం దానికి భిన్నం. అచ్చం బీజేపీ సోషల్ మీడియా స్టైల్లో ఆయన టీవీ చానల్ స్టోరీస్ ప్రసారం చేస్తూంటారు. విపక్షాలన్నింటినీ పాకిస్థాన్ మద్దతు దారులుగా చెప్పడానికి ఆయన ఏ మాత్రం సంకోచించరు. దీంతో ఆయనకు మీడియాలో కూడా పెద్దగా మద్దతు లభించలేదు.
ఎడిటర్స్ గిల్డ్ లాంటి సంస్థలు మొక్కుబడిగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశాయి. బీజేపీ మద్దతు ఉన్న కొంత మంది అరెస్టును ఖండించారు. కానీ ఇతర వర్గాల నుంచి సపోర్ట్ రాలేదు. జర్నలిస్టులు పూర్తిగా ఒక వర్గానికి .. ఒక పార్టీకి అంకితమైపోతే.. ఇతరులపై విషం చిమ్మితే అది జర్నలిజం అనిపించుకోదు. ఆ మీడియాకు విశ్వసనీయత ఉండదు. ప్రస్తుతం ఆర్నాబ్ ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.