కేంద్ర దర్యాప్తు విభాగం సీబీఐ .. బీజేపీ అనుబంధసంస్థలా మారిపోయిందని విపక్ష పార్టీలు తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో… బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రం..సీబీఐకి తాము ఇచ్చిన జనరల్ కన్సెంట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కేరళ చేరింది. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. లెఫ్ట్ ఫ్రంట్ నేతలపై అనేక రకాల ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎన్ఐఏ విచారణ కూడా చేయించారు. ఆ కేసును నేరుగా దావూద్ ఇబ్రహీంతో లింక్ పెట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ఆరోపణలు కూడా చేస్తూ.. కేరళలో సీబీఐ విచారణ ఖాయమనే ప్రచారాన్ని బీజేపీ నేతలు చేస్తున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. జనరల్ కన్సెంట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ జనరల్ కన్సెంట్ను రద్దు చేసింది. మహారాష్ట్రలో జరిగిన సుషాంత్ హత్య కేసు.. టీఆర్పీ స్కాం వంటి వాటిని.. పరాయి రాష్ట్రాలతో సీబీఐకి సిఫార్సు చేయించి.. సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. దీనిపై మహారాష్ట్ర సర్కార్ అగ్గిమీద గుగ్గిలం అయింది. సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది. అంతకు ముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. పంజాబ్ సీఎం కూడా.. సీబీఐకి తమ రాష్ట్రంలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. ఏపీ సీఎంగా ఉన్నప్పుడు.. జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. బీజేపీ .. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని అనుమానించారు. ప్రతిపక్ష నేతలపై కేసుల కోసమే ఆ సంస్థను వాడుకుంటున్నారని అనుమానించారు. ఏపీలో ప్రభుత్వం మారిన తరవాత.. జగన్ సర్కార్ జనరల్ కన్సెంట్ను పునరుద్ధరించింది.
సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్థ అయినప్పటికీ.. తన ఇష్టంగా కేసులు నమోదు చేయడానికి దర్యాప్తు చేయడానికి అవకాశం లేదు. ప్రతీ రాష్ట్రం దానికి అనుమతిఇవ్వాల్సిందే. అందుకే ఇప్పటి వరకూ రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ ఇస్తూ వస్తున్నాయి. సీబీఐని ఏర్పాటు చేసిన తర్వాత దశాబ్దాల పాటు.. సీబీఐ అధికార పార్టీ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తుందనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోలేదు. జనరల్ కన్సెంట్ రద్దు చేయాల్సినంత తీవ్రంగా దిగజారిపోలేదు. కానీ ప్రస్తుతం మాత్రం… ఇష్టం లేని వారిని అరెస్ట్ చేయవచ్చన్నట్లుగా చెలరేగిపోతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో విశ్వసనీయత కోల్పోతోంది. రాష్ట్రాలు.. జనరల్ కన్సెంట్ రద్దు చేసినప్పటికీ.. కోర్టు ఆదేశిస్తే మాత్రం.. సీబీఐ కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టవచ్చు.