ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ప్రస్థానం ఉచితం దగ్గర్నుచి ఒకరికే మొత్తం కట్టబెట్టడం వరకూ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఇసుక రీచ్‌లను ఒకే సంస్థకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకుంటే ఇంటికే డోర్ డెలివరీ చేస్తోంది. ఆన్ లైన్ బుకింగ్.. ఇంటికి డెలివరీ చేయడం… రవాణా చార్జీలు మొత్తం ఫ్రాడ్ అన్న ఆరోపణలు ప్రజల నుంచి రావడంతో ఇసుక పాలసీని మార్చాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్.. ప్రజల సూచనలే శిరోధార్యమని చెప్పి..రూ. కోట్లు ఖర్చు పెట్టి పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు.
ఎంత మంది ప్రజలు ఒకే కంపెనీకి ఇసుక మొత్తం కట్టబెట్టాలని సలహా ఇచ్చారో చెప్పలేదు.. ప్రజల నుంచి ఎలాంటి సూచనలు వచ్చాయో చెప్పలేదు కానీ… మొత్తం ఇసుకను ఒక్కరికే కట్ట బెట్టాలని నిర్ణయించింది. మొదటగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం అనుకుందట.. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకపోవడంతో… పేరుగాంచిన ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందిట. ఆ పేరుగాంచిన ప్రైవేటు సంస్థ ఏదో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తమిళనాడులో ఇసుక కాంట్రాక్టులు నిర్వహిస్తున్న శేఖర్ రెడ్డినో.. మరో ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ సామాజిక బాధ్యత ఉన్న ప్రముఖుడో ఇసుక మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజలకు ఇసుక భారంగా మారింది. ఇప్పుడు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలు ఇసుక దోచుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడా విమర్శలకు చెక్ పడే అవకాశం ఉంది. ఒక్క వ్యక్తే దోచుకుంటున్నారని ఆరోపణలు చేసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఎవరికి బినామినో కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.