అధ్యక్షుడిగా గెలిచి తీరుతున్నానని ఎక్కడ లేని నమ్మకంతో ఉన్న రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌కు చివరికి హార్ట్ బ్రేక్ తప్పేలా లేదు. డెమోక్రాట్ బైడెన్ ప్రస్తుతం తాను అధిక్యం కనబరుస్తున్న నెవెడా రాష్ట్రంలో పాపులర్ ఓట్లలో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటే చాలు..అగ్రరాజ్య పీఠంతో పాటు ప్రపంచానికి అగ్రజుడనే హోదా కూడా దక్కుతుంది. అత్యంత కీలక రాష్ట్రాలైన నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, జార్జియాల్లో ట్రంప్ ఆధిక్యత చూపిస్తున్నారు. కానీ అక్కడ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ వల్ల కౌంటింగ్ మందకొడిగా సాగుతోంది. ఎప్పటికి పూర్తవుతుందో అంచనా వేయడం కష్టంగా మారింది.
నార్త కరోలినా, పెన్సిల్వేనియాల్లో ట్రంప్ ఆధిక్యం ఎక్కువగానే ఉంది. కానీ జార్జియాలో మాత్రం రాను రాను తగ్గిపోతోంది. ఇది ట్రంప్ శిబిరాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. మిచిగాన్‌లో గెలిచేశామనుకున్న రిపబ్లికన్లకు.. అక్కడ మెయిల్ ఇన్ బ్యాలెట్స్‌తో బైడెన్‌కు తిరుగులేని మెజార్టీ రావడం షాక్ ఇచ్చేలా చేసింది. చివరికి ఆ రాష్ట్రం బైడెన్ ఖాతాలో పడింది. ఇప్పుడు జార్జియా కూడా అలాగే అయితే.. ట్రంప్‌కు న్యాయపోరాటం చేసేందుకు కూడా.. నైతిక మద్దతు లభించకపోవచ్చు.
ప్రస్తుతం తాను మొదట్లో ఆధిక్యంలో ఉండి.. తర్వాత వెనుకబడిన రాష్ట్రాల్లో కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. స్థానిక కోర్టుల్లో పిటిషన్లు కూడా వేశారు. అమెరికా ఎన్నికల్లో ముందస్తు ఓటు వేసిన వారంతా డెమెక్రాట్లుగా.. పోలింగ్ రోజు ఓట్లు వేసిన వారిని రిపబ్లికన్లుగా అంచనా వేస్తున్నారు. కౌంటింగ్‌లో ముందుగా పోలింగ్ ఓట్లు లెక్కించడంతో ట్రంప్ జోరు కనిపించింది. పోస్టల్ ఓట్లు లెక్కించడం ప్రారంభించిన తర్వాత బైడెన్ దూసుకొచ్చారు. చివరికి లేటయినా ట్రంప్ వైట్ హౌస్‌ను వదలక తప్పదన్న సంకేతాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి.