బీహార్లో రెండు విడతలు ఎన్నికలు ముగియగానే.. సీఎం నితీష్ కుమార్ రిటైర్మెంట్ పాట అందుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నా… ఆయన చిన్న కుమారుడు తేజస్వి మాత్రం.. ఆ లోటు లేకుండా ఎన్నికల సమరాన్ని ఈదుతున్నారు. కూటమి కట్టి.. నితీష్, మోడీలకు సవాల్ విసురుతున్నారు. తొలి రెండు విడతల ఎన్నికల్లో పెద్దగా సానుకూలత కనిపించలేదేమో కానీ.. చివరి విడతలో ఓటర్ల సానుభూతి పొందేందుకు ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ రిటైర్మెంట్ పాట అందుకున్నారు. ఎన్నికల ప్రచారంలో తనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటించారు.
ఆయన ఉద్దేశం ప్రకారం.. తాను ఇక ఓటు అడగననని.. ఈ ఒక్క సారికి తనకు ఓటు వేయాలని అడగడం అని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అయితే.. నితీష్ ప్రకటన.. ఓటర్లలోఆయనకు సానుభూతి తెస్తుందో లేదో కానీ.. మొత్తంగా బీజేపీ, జేడీయూ కూటమికి వ్యతిరేక సంకేతాలు మాత్రం పంపుతోంది. చేతులెత్తేయడం వల్లనే చివరి ప్రయత్నంగా.. ఆయన సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారని అంటున్నారు. నితీష్ మధ్యలో ఏడాదిన్నర తప్ప.. పదిహేనేళ్లుగా సీఎంగా ఉన్నారు. అయితే ఎప్పుడూ కూడా ఆయన సొంత పార్టీ ద్వారా పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాలేదు.