తమిళనాడు రాజకీయం హీటెక్కింది.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా మొదలైన ప్రచారంతో పార్టీలన్నీ ఉలిక్కిపడ్డాయ్.. అయితే తనకు తెలియకుండా తండ్రి పార్టీని రిజిస్టర్ చేయించారని, తనకు సంబంధం లేదని విజయ్ ప్రకటించేశారు. కానీ విజయ్ రాజకీయ ఆశలు.. ఆశయాల గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఆయన పొలిటికల్ గేమ్ ప్రారంభమయిందని అంటున్నారు. జయలలిత, కరుణానిధి లేని తమిళనాడు రాజకీయాల్లో ఉన్న గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు సినీ తారలు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ విషయంపై ఎటూ తేల్చకుండా సాగదీస్తున్నారు. ఆయన ఆరోగ్యం కుదురుగా ఉంటే రాజకీయాల గురించి ఆలోచిస్తారని లేకపోతే లేదని చెబుతున్నారు. అదే సమయంలో మరో సూపర్ స్టార్ కమల్ హాసన్ తాను పార్టీని ప్రారంభించేసి ఎన్నికల బరిలోకి కూడా దిగుతున్నారు.
కొత్తగా దళపతి విజయ్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ తమిళనాట ప్రచారం హోరెత్తింది. విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఓ పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేశారు. ఇది విజయే చేయిచారంటూ.. ఒక్క సారిగా ప్రచారం ప్రారంభమయింది. ప్రచారం పీక్స్‌కి వెళ్లిన తర్వాత విజయ్ నింపాదిగా స్పందించాడు. తనకు, రిజిస్టర్ అయినట్టుగా చెబుతున్న పార్టీకి ఎలాంటి సంబంధం లేదని విజయ్ ప్రకటించాడు. అది పూర్తిగా అభిమానుల కోరిక మేరకు జరిగిందని వివరించారు. అయితే అభిమానులు… విజయ్ తండ్రి చంద్రశేఖర్ సూచనల మేరకు పార్టీని రిజిస్టర్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆ పార్టీతో తనకు సంబంధం లేదనిఅంటున్నారు.
విజయ్‌కి రాజకీయాలపై మంచి ఆసక్తి ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటారు. జల్లికట్టుతో పాటు వివిధ కావేరీ తరహా ఆందోళనల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటారు. సీనియర్లు కాకుండా.. ప్రస్తుతం తమిళంలో ఉన్న టాప్ స్టార్లు ఇద్దరు అజిత్, విజయ్. విజయ్‌కు తమిళనాట గ్రామగ్రామానా అభిమాన సంఘాలు ఉన్నాయి. పైగా ఇటీవలి కాలంలో ఆయన బీజేపీ వైపు నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. ఆయన సినిమాలు బీజేపీని టార్గెట్ చేసినట్లుగా ఉంటాయని చెబుతారు. అందుకే.. ఎప్పుడూ విజయ్ అని చెప్పుకునే ఆయన కొన్ని వివాదాల తర్వాత జోసెఫ్ విజయ్ అని చెప్పుకోవడం ప్రారంభించారు. రాజకీయ పార్టీ అంశాన్ని విజయ్ కొట్టి పారేసినా… ఆయన మనసులో మాత్రం ఆ అంశం ఉందని తమిళనాట గట్టిగా నమ్ముతున్నారు. తమిళనాడు శాసనసభకు 2021లో ఎన్నికలు జరగనున్నాయి . అందుకే రాజకీయ పార్టీల హడావుడి ప్రారంభమయింది. డీఎంకే తరపున స్టాలిన్ తమిళనాడు మొత్తం క్రేజ్ ఉన్న నేతగా నిలబడగా.. ఆయనకు పోటీగా.. నిలబడే ఇమేజ్ ఉన్న నేత కరవయ్యారు. ఆ గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు తారలు బయటకు వస్తున్నారు.