బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీలకు 60 శాతానికిపైగా పదవులు కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ ఏపీ కమిటీని అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా గతంలోనే అచ్చెన్నాయుడును ప్రకటించారు. అచ్చెన్నాయుడుతో నిరంతరం సంప్రదింపులు జరిపి.. కార్యవర్గానికి ఓ రూపు ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వానికి భయపడకుండా పోరాడుతున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. యువతకు ఎక్కువ పదవులు లభించాయి. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షుల్ని నియమించారు. ఇప్పటి వరకూ పార్టీలో ఎటువంటి పదవులు లేకపోయినా చురుకుగా ఉంటున్న పలువురికి పదవులు ఇచ్చారు.
కమిటీలో ఉన్న వారి సగటు వయస్సు 48 ఏళ్ళు మాత్రమే. మొత్తం 219 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. 18 మంది ఉపాధ్యక్షులు.. 16 మంది ప్రధాన కార్యదర్శులు , 18 అధికార ప్రతినిధులు ఉన్నారు. జాతీయ కమిటీల్లో చోటు దక్కని వారందరికీ ఇక్కడ అవకాశం కల్పించారు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించే వారిలో ప్రధాన కార్యదర్శులు ఎక్కువగా ఉంటారు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, దేవినేని ఉమ, భూమా అఖిలప్రియ, పంచుమర్తి అనురాధ, గౌతు శిరీష లాంటి వారికి చోటు కల్పించారు.
బడుగు బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో.. అగ్ర కులాలకు ఈ సారి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. టీడీపీకి దన్నుగా ఉంటుందనుకున్న సామాజికవర్గం కన్నా.. బీసీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. స్వయంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బీసీ కావడంతో.. టీడీపీ నాయకత్వం బీసీల చేతుల్లోకి వెళ్తుందన్న అభిప్రాయం కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ముందు టీడీపీ కార్యక్రమాల్లో బీసీ నేతలే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.