సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసి దాన్ని ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల పదహారో తేదీన విచారణ జరపనుంది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని.. సుప్రీంకోర్టు లాయర్లు జీఎస్ మణి, సునీల్ కుమార్ సింగ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణ వేగవంతం అయ్యే దశలో.. న్యాయమూర్తుల్ని బెదిరించేందుకు ఇలా చేశారన్న ఆరోపణలు అంతటా వెల్లువెత్తాయి. అనేక మంది న్యాయనిపుణులు, న్యాయకోవిదులు జగన్మోహన్ రెడ్డి తీరు కోర్టు ధిక్కరణగానే ప్రకటించారు. ఈ సమయంలో… కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు రానుండటం ఆసక్తికరంగా మారింది.
తన లేఖలో జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేశారు. సాధారణంగా న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడానికి ఓ పద్దతి ఉంటుంది . రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు అత్యున్నత స్థాయి రక్షణ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. తన దగ్గర అధికారం ఉన్నందున కేసులు కూడా నమోదు చేసి.. దాడికి పాల్పడుతున్నారన్న విమర్శలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో పాటు, వాటిని బహిర్గతం చేయడం ద్వారా జగన్ న్యాయస్థానాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన లాయర్లు తమ పిటిషన్లో వివరించారు. రాజ్యాంగ నియమాలను జగన్ ఉల్లంఘించారని, దేశపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అస్థిరపరచాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ పిటిషన్‌పై విచారణ పదహారో తేదీన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.