రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ నిజంగా జోకరయ్యాడు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన వెంటనే .. తన గెలుపును తాను ప్రకటించేసుకుని ఇక ఓట్ల లెక్కింపు ఆపేయాలని హడావుడి చేశారు. కోర్టులకు వెళ్లి ఎదురుదెబ్బలు తిన్నారు. తీరా చివరికి వచ్చేసరికి ట్రంప్ అసలు రేసులో లేడన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. నిన్నటిదాకా ఆయనను రేసులో నిలబెట్టిన జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగే కొద్దీ జో బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. ఈ విషయం ముందుగానే ఊహించిన ట్రంప్.. ఓట్ల లెక్కింపు ఆపాలంటూ హడావుడి చేశారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఫలితాలు తెలియాల్సి ఉంది. వీటిలో నెవెడా, జార్జియా, పెన్సిల్వేనియాల్లో బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఆధిక్యం స్వల్పమే అయినప్పటికీ.. ట్రెండ్స్ మొత్తం ఆయన వైపే ఉండటం.. ఓట్ల లెక్కింపు చివరికి రావడంతో గెలుపు ఆయనదేనని క్లారిటీ వచ్చేసింది. ఇక నార్త్ కరోలినా, అలస్కాలో మాత్రమే ట్రంప్ లీడింగ్‌లో ఉన్నారు. ఈ రెండింటితో కలిపి ఉన్న మొత్తం ఎలక్టోరల్ ఓట్లు పద్దెనిమిది మాత్రమే. ఇప్పటికి ట్రంప్‌కు వచ్చిన 213 ఓట్లతో కలిపితే మొత్తగా 241 మాత్రమే వస్తాయి. పెన్సిల్వేనియాలో ఇరవై, జార్జియాలో పదహారు, నెవెడాలో ఆరు కలిపితే బైడన్ ఎలక్టోరల్ ఓట్లు మూడు వందలు దాటిపోతాయి. పెన్సిల్వేనియా, జార్జియాల్లో ఓట్లు స్వింగ్ అయిన విధానం చూసి ట్రంప్ క్యాంప్ నివ్వెరపోయింది.
ఆశలు వదిలేసుకుంది. జార్జియాలో 0.5 శాతం కన్నా తక్కువ తేడాతో బైడెన్ గెలిస్తే రీకౌంటింగ్ చేయించాలని అనుకుంది. సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాలని అనుకున్నారు. కానీ మొత్తం నిరాశలో కూరుకుపోయినట్లుగా కనిపిస్తోంది. బైడెన్ గెలుపుపై అధికారిక ప్రకటన ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉంది.