ఈసారి కప్పు మాదే… అంటూ బెంగళూరు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే… ఈసారి కూడా బెంగళూరు జట్టు అభిమానుల్ని నిరాశ పరిచింది. ప్లే ఆఫ్ లో బోల్తా పడింది. ఈరోజు జరిగిన ఎలిమినేటర్‌లో బెంగళూరుని ఓడించిన హైదరాబాద్ .. మరో అడుగు ముందు కేసింది. సెమీ ఫైనల్ స్టేజీకి చేరుకోగలింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు ఏ దశలోనూ హైదరాబాద్ బౌలర్లని ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్లలో కేవలం 131 పరుగులే సాధించింది. డివిలియర్స్ ఒక్కడే అర్థ సెంచరీతో రాణించాడు. కోహ్లీతో సహా మిగిలిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ కాస్త తడబడినా.. విలియమ్సన్ (50 నాటౌట్ 44 బంతుల్లో) రాణించడంతో.. మరో రెండు బంతులు ఉండగానే… ఆరు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ జట్టు… విజయాన్ని అందుకుంది. మనీష్ పాండే (24), హోల్డర్ (24 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో… హైదరాబాద్ కప్పు వేటలో మరో ముందడుగు వేసింది. ఈ ఆదివారం ఢిల్లీతో జరిగే మ్యాజ్‌లో హైదరాబాద్ గెలిస్తే… ఫైనల్ లో అడుగుపెడుతుంది. ఇప్పటికే ఢిల్లీతో గెలిచిన ముంబై.. ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.