రాజధాని ప్రాంతంలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యవహారశైలి రాను రాను వివాదాస్పదంగా మారుతోంది. ఆమె మతం మార్చుకుని కూడా ఎస్సీ సర్టిఫికెట్ను ఉపయోగించుకుని ఎమ్మెల్యే అయ్యారన్న ఆరోపణలు ఉండగానే నియోజకవర్గంలో ఆమె వ్యవహారశైలి తీవ్రంగా వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీ నేతలు ఆమెపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఆమెపై తాడికొండలోని అన్ని గ్రామాల వైసీపీ నేతలు.. మండిపడుతన్నారు. ఆమెకు సంబంధించిన ఆడియో టేపులు వెలుగులోకి తెస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆమె అవినీతి బాగోతాలన్నింటినీ బయట పెడతామని సోషల్ మీడియాలో హెచ్చరిక పోస్టులు పెడుతున్నారు. దీంతో ఉండవల్లి శ్రీదేవి ఇద్దరు నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొద్ది రోజుల క్రితం.. అక్రమ మద్యం కేసుతో పాటు పేకాట శిబిరం నిర్వహిస్తూ.. మరొక నేత దొరికిపోయారు. వారిద్దరూ ఉండవల్లి శ్రీదేవికి అనుచరులు. అయితే.. ఆ అక్రమాలు ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో శ్రీదేవి వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. అప్పటి నుండి వారిద్దరూ పగబట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే అక్రమాలన్నింటినీ బయట పెడతామని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అదే సమయంలో.. మండలానికో నేత బయటకు వచ్చి ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నిధులు ఎమ్మెల్యేకు ఇచ్చామని ఇప్పుడు తిరిగివ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
అయితే ఉండవల్లి శ్రీదేవిని ఇలా టార్గెట్ చేసుకోవడం వెనుక.. వైసీపీలోని అంతర్గత రాజకీయాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ స్వగ్రామం రాజధాని గ్రామాల పరిధిలోనే ఉంటుంది. ఆయన తాడికొండలో ఎక్కువ కలుగజేసుకుంటున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే.. ఎమ్మెల్యేను టార్గెట్ చేశారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఉండవల్లి కూడా.. తనకు ఎదురు తిరిగిన పార్టీ నేతలపై కేసులు పెట్టిస్తున్నారు.