ప్రపంచం మొత్తం కరోనా సెకండ్ వేవ్‌లోకి వచ్చేసింది. దానికి భారత్ కూడా అతీతం కాదు. అమెరికాలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూండగా.. ఇండియాలో కూడా.. అదే స్థాయిలో పెరుగుదల నమోదవుతోంది. గత కొన్నాళ్లుగా ఇండియా కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. అనూహ్యంగాఇప్పుడు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో యాభై వేలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 84 లక్షలు దాటిపోయింది. మృతుల సంఖ్య లక్షా పాతికవేలు దాటింది. అయితే రికవరీ రేటు ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం దేశంలో ఐదు లక్షలు మాత్రమే యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 92 శాతం మందికిపైగా డిశ్చార్జ్ అయ్యారు.
శీతాకాలం ప్రారంభమవ్వడం.. పూర్తి స్థాయిలో అన్‌లాక్ నిబంధనలు సడలించడంతో…కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉంటుంది..అది మరింత ప్రమాదకరంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. యూరప్ దేశాలు ఇప్పటికే సెకండ్ లాక్ డౌన్ ప్రకటించేశాయి. చాలా దేశాల్లో జన జీవనం స్తంభించిపోయింది. యూరప్ వాసులపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అక్కడ ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉంటోంది. దీంతో లాక్‌డౌన్‌కే మొగ్గుచూపుతున్నాయి. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం కోరనాను తేలిగ్గా తీసుకుంటున్నాయి. అందులో భారత్ కూడా ఉంది.
కరోనా నిబంధనలు పేరుకు మాత్రమే ఉన్నాయి . ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ముందుగా ప్రభుత్వ పెద్దలు.. అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తే.. సామాన్యులు కూడా పాటిస్తారు. ఇండియాలో.. కరోనా తమకు అతీతం అన్నట్లుగా అధికారం ఉన్న వారు వ్యవహరిస్తూంటారు. దాంతో.. సామాన్యులు కూడా కరోనాను లైట్ తీసుకుంటున్నారు. ఇది సెకండ్‌వేవ్‌కు దారి తీస్తోంది.