కృష్ణ కుమార్తెగా, మహేష్ సోదరిగా… చిత్రసీమలోకి అడుగుపెట్టింది మంజుల. `షో` సినిమాతో ఆకట్టుకున్నా – ఆ క్రెడిట్ అంతా నీలకంఠకు వెళ్లిపోయిది. ఆ తరవాత.. మంజుల పెద్దగా మెరిసింది లేదు. ఆమధ్య `మనసుకు నచ్చింది` అనే సినిమాకు దర్శకత్వం వహించింది. అయితే.. ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది. తరవాత.. మంజుల తెర ముందూ, వెనుకా కనిపించలేదు.
కాకపోతే.. ఇప్పటికీ మంజులకు దర్శకత్వ కలలు ఉన్నాయట. మళ్లీ ఓ సినిమా చేస్తానని, అన్నీ కుదిరితే… తన దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమా చేస్తానని ప్రకటించింది. ఎంత సోదరుడైనా.. మహేష్ ఓ సూపర్ స్టార్. తనతో సినిమా చేయడం అంత ఈజీ కాదు. అంతకంటే ముందు మంజుల దర్శకురాలిగా తనని తాను నిరూపించుకోవాలి. `మనసుకు నచ్చింది` లాంటి సినిమా చూస్తే.. కనీసం కొత్త హీరో కూడా దర్శకురాలిగా మంజులకు అవకాశం ఇవ్వడు. అలాంటిది మహేష్ ఎలా ఇస్తాడు?
ఈ విషయం మంజులకూ అర్థమైంది. అందుకే `ముందు ఓ మంచి సినిమా తీసి, నన్ను నేను నిరూపించుకుంటా. ఆ తరవాతే…. మహేష్ దగ్గరకు వెళ్తా. `మనసుకు నచ్చింది` హిట్టయితే… నా ప్రయాణం వేరేలా ఉండేది. మహేష్ కూడా నాతో సినిమా చేయడానికి రెడీగా ఉండేవాడు` అని చెప్పింది మంజుల.