ఐపీఎల్ లో సర్ రైజర్స్ ప్రయాణం ముగిసింది. ఈరోజు జరిగిన క్వాలిఫయర్ 2లో ఢిల్లీ చేతిలో 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దాంతో.. ఢిల్లీ ఫైనల్ లోకి ప్రవేశించింది. 13 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో… ఢిల్లీ ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి. మంగళవారం జరిగే టైటిల్ పోరులో ముంబై – ఢిల్లీ తలపడనున్నాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వరుసగా డకౌట్లు అవుతున్న ధావన్ ఈ కీలకపోరులో చెలరేగి ఆడాడు. కేవలం 50 బంతుల్లో 78 పరుగులు చేసి, ఢిల్లీకి శుభారంభం ఇచ్చాడు. స్టోయిన్స్ (38) హెట్మయర్ (42) రాణించారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. రబాడా అద్భుతంగా బౌలింగ్ చేసి 29 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి… ఢిల్లీని ఫైనల్ కి చేర్చాడు. బ్యాటింగ్ లో రాణించిన స్టోయిన్స్ బౌలింగ్‌లోనూ విజృంభించి 3 వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్ తరపున కేన్ విలియమ్సన్ (67), సమద్ (33) మాత్రమే రాణించారు. మిగిలిన బ్యాట్స్మెన్సంతా తక్కువ స్కోర్లకే పరిమితం అవ్వడం హైదరాబాద్ ఓటమి మూటగట్టుకోవాల్సివచ్చింది. దాంతో పాటు ఫీల్డింగ్ లోపాలూ.. ఆ జట్టు కొంప ముంచాయి.