జిల్లాల విభజనపై ప్రజల్లో ఉందని అంచనా వేస్తున్న తెలుగుదేశం పార్టీ మెల్లగా రూటు మారుస్తోంది. రాజకీయం కోసమే జిల్లాల రూపు రేఖల్ని మారుస్తున్నారని.. అలాంటి మార్పులకు తాము వ్యతిరేకమని.. టీడీపీ యువనేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా విభజనపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాను విభజించడం వల్ల అసలు జిల్లా అస్థిత్వమే పోతుందని రాజకీయ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైసీపీలో కీలక నేతగా ఉన్న ధర్మాస ప్రసాద్ కూడా.. శ్రీకాకుళం జిల్లా విభజనపై తన వ్యతిరేకతను తెలియచేశారు. ఇప్పుడు.. ఆయన బాటలోకి ప్రతిపక్ష ఎంపీ రామ్మోహన్ నాయుడు వచ్చి చేశారు.
జిల్లాల విభజనకు రామ్మోహన్ నాయుడు వ్యతిరేకత కేవలం శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే పరిమితం కాదని.. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలతోనే తెలుస్తోందని అంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని.. జిల్లాలనేవి ఎప్పుడూ మార్చుకునేవి కావని గుర్తు చేస్తున్నారు. కానీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ మాత్రం ఓ పద్దతి ప్రకారం జరుగుతూ ఉంటుందని గుర్తు చేశారు. 2026లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అప్పుడు ఏపీకి.. పార్లమెంట్ సీట్లు పెరుగుతాయో.. తగ్గుతాయో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే.. దక్షిణాదిలో జనాభాను నియంత్రించారు. ఈ కారణంగా ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఒక వేల ఉన్న పార్లమెంట్ సీట్లు ఉంచినా.. సరిహద్దులు మాత్రం మారడం ఖాయం. అప్పుడు మళ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజిస్తారా అని టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
జిల్లాల విభజన అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తెలంగాణలో జిల్లాలను విభజించారు కానీ.. ఇప్పటికీ.. వాటికి అస్థిత్వం రాలేదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే వ్యవహారాలు నడుస్తున్నాయి. పైగా అక్కడి ప్రజలు బలంగా జిల్లాల విభజనను కోరుకున్నారు. ఏపీలో ఆ పరిస్థితి లేదు. కొన్ని రాజకీయ పార్టీలు.. సంఘాలు మాత్రం.. తమ ప్రాంతానికి జిల్లా కావాలంటూ ప్రెస్‌నోట్లు రిలీజ్ చేస్తున్నారు.. సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. ప్రజల్లో కదలిక వచ్చే అవకాశం లేదని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఈ విషయాలన్నింటినీ ఆకళింపు చేసుకుని జిల్లాల వారీగా… విభజన వ్యతిరేకతను తెలియచేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా రామ్మోహన్ నాయుడు ప్రకటన వ్యూహాత్మంగా ఉందని తెలుస్తోంది. ముందు ముందు మరికొంత మంది టీడీపీ నేతలు.. రాజకీయం కోసం.. వైసీపీ జిల్లాలను చీలికలు.. పేలికలు చేయాలనుకుంటోందని.. ప్రజల సెంటిమెంట్లను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోందని.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల విభజన రాజకీయంగా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది.