మలయాళంలో ఘన విజయం సాధించిన `అయ్యప్పయుమ్ కోషియమ్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజూ మీనన్ పాత్రలో పవన్ నటించబోతున్నాడు. ఇక ఫృథ్వీరాజ్ పాత్ర కోసం మరో హీరోని వెదికి పట్టుకోవడమే తరువాయి. ఈపాత్రకు ముందు నుంచీ వినిపిస్తున్న పేరు.. రానా. ఆ తరవాత విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి పేర్లు బయటకు వచ్చాయి. అయితే.. ఇప్పుడు రానా పేరు ఖాయం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఈ రీమేక్ కోసం చిత్రబృందం రానాని సంప్రదించింది. అయితే.. రానా ఇప్పటి వరకూ స్పందించలేదని టాక్. అయితే… తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. “ఆ రీమేక్ కోసం నన్ను సంప్రందించిన మాట నిజమే. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఆ పాత్ర చేయడం నాకూ ఇష్టమే“ అని మనసులోని మాట బయటపెట్టేశాడు. అంటే…ఈ రీమేక్ చేయడానికి రానాకి ఎలాంటి అభ్యంతరాలూ లేవన్నమాట. దర్శక నిర్మాతల లెక్కలే తేలాలి. పవన్ – రానా ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? పవన్‌కి రానా సరితూగుతాడా? రానా డేట్లు సర్దుబాటు చేయగలడా? ఇలాంటి లెక్కలన్నీ తేలిపోతే.. ఈ రీమేక్ కి ఆటంకాలు తొలగిపోయినట్టే.