ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఇరవై ఐదు కాదు.. 32కి చేరింది. లోక్సభ నియోజకవర్గాలు అన్ని పెరుగుతాయా… అని అశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంది. లోక్సభ నియోజకవర్గనికి ఓ జిల్లా అని కాకుండా… ఎన్ని జిల్లాల డిమాండ్లు వస్తే అన్ని జిల్లాలు.. రాజకీయంగా ఎంతగా కలసి వస్తే అన్ని జిల్లాలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో 32 జిల్లాలు ఏర్పడతాయని మంత్రి తానేటి వనిత రాజమండ్రిలో ప్రకటించారు. నిజానికి జిల్లాల ప్రక్రియ అనేదానితో మంత్రి వనితకు సంబంధం లేదు. కానీ..అలాంటి వ్యాఖ్యలు చేయాలని ఎవరో చెప్పినట్లుగా ఆమె మీడియా ముందు 32 జిల్లాల ముచ్చట చెప్పారు.
ఆ తర్వాత కాసేపటికే.. కొత్త జిల్లాలయ్యే 32 అవేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో అమరావతిని కూడా ఓ జిల్లాగా నిర్దేశించారు. జగ్గయ్యపేట నుంచి అమరావతి జిల్లా ప్రారంభమవుతుంది. రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన నాలుగు కమిటీలు.. జిల్లా స్థాయిలో 6 నుంచి 8 కమిటీలను కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధికారులు సిద్ధం చేశారు. వీరి వద్దకు తమ తమ ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనే డిమాండ్లుతో నేతలు వెళ్తున్నారు. అలా వచ్చే నేతల విజ్ఞప్తులకు తగ్గట్లుగా సంఖ్యను పెంచుకుటూ పోతున్నారు. కమిటీలు నివేదికలు వచ్చి..వాటిని పరిశీలించి పూర్తి స్థాయి కసరత్తు నిర్వహించి.. ఖరారు చేసేందుకు.. మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది.
ఆ లోపు పలుకుబడిన నేతలు కొత్త కొత్త డిమాండ్లతో వస్తే… అంగీకరిస్తారు. చివరికి ఆ సంఖ్య నలభైకి చేరిన ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే.. పదకొండు జిల్లాల తెలంగాణ ఇప్పుడు 33 జిల్లాల తెలంగాణ అయింది. అలాంటిది.. పదమూడు జిల్లాల ఏపీ.. 40 జిల్లాలు చేస్తే తప్పేమిటనే వాదన వినిపించడానికి కావాల్సినంత బలం ఉంటుంది మరి. మొత్తానికి ప్రజలు తాము ఏ జిల్లా కిందకు వస్తామో తెలియనంతటి పరిస్థితి ఏపీకి వచ్చేలా కనిపిస్తోంది.