నంద్యాలలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మైనార్టీ కుటుంబం వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుందంటూ.. సీఐను సస్సెండ్ చేసి అరెస్ట్ చేశారు. హెడ్ కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. కానీ వారికి బెయిల్ ఇట్టే లభించింది. ఇరవై నాలుగు గంటలు కూడా వారు అరెస్ట్ కాలేదు. ఘటన జరిగినప్పుడు సైలెంట్‌గా ఉన్న ప్రభుత్వం… తమ ఆత్మహత్యకు పోలీసులే కారణం అంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు రాగానే.. కదిలింది. ఆ వీడియో వైరల్ కావడంతో.. రాజకీయ పార్టీలు స్పందించాయి.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. దీంతో వైసీపీ మైనార్టీ నేతలు రంగంలోకి దిగి.. టీడీపీపై తిట్ల దండకం అందుకున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా నంద్యాల వెళ్లి చనిపోయిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. అంజాద్ భాషా ఎవరికి అండ ఇస్తారో కానీ.. ఆయన మాత్రం.. మైనార్టీలపై జరుగుతున్న దాడులతో .. తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో హుటాహుటిన నంద్యాల వెళ్లారు.
అమరావతిలో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని అడ్డుకున్న కేసులో దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన ప్రభుత్వం.. ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసులు పెట్టినట్లుగా హడావుడి చేసింది కానీ.. ఆ కేసులు ఇలా బెయిల్ పిటిషన్ పెట్టుకోగానే.. అలా వచ్చేసే కేసులుగా పెట్టింది. ఫలితంగా వారిద్దరికీ ఇరవై నాలుగు గంటలు కాక ముందే బెయిలొచ్చింది. ప్రభుత్వం, పోలీసులు తల్చుకుంటే ఎలాంటి మాయ అయినా చేయగలదని విపక్ష పార్టీలు మండి పడుతున్నాయి.