ఏపీ సర్కార్ అమరావతి రాజధానిని తరలించాలని నిర్ణయించడంతో కొత్త కొత్త చిక్కులు వస్తున్నాయి. న్యాయస్థానాల్లో ఎలా వాదించాలో తెలియక ఇబ్బందిపడే కేసులు వస్తున్నాయి. అలాంటి కేసు ఒక దాన్ని అశ్వనీదత్ దాఖలు చేశారు. దానిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం అదే పనిగా సమయం తీసుకుంటోంది. సెప్టెంబర్‌లో అశ్వనీదత్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ కౌంటర్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరుతూనే ఉంది. దీంతో ఆ పిటిషన్‌పై విచారణ పూర్తి స్థాయిలో జరగడం లేదు.
గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం అశ్వనీదత్ తన భూమిని ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచారు. ఆ సందర్భంగా రన్‌వేను విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ తగినంత భూమి అందుబాటులో లేదు. అక్కడ భూసేరకణ చేయడం ఎయిర్‌పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియాకు అసాధ్యంగా మారింది. చివరకు ప్రభుత్వ జోక్యంతో గన్నవరం విమానాశ్రయం రన్‌వేకు అవసరమైన భూములు ఇస్తే.. ఆ మేరకు.. రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయించేలా ఒప్పందం చేసుకుని భూమిని ఇప్పించారు. చాలా మంది రైతులు తమ భూములను ఇచ్చారు. ఇలా ఇచ్చిన వారిలో.. అశ్వనీదత్ కూడా ఉన్నారు. అశ్వనీదత్ 39 ఎకరాలిచ్చారు.
అయితే ఇప్పుడు అమరావతిలో రాజధాని ఉండటం లేదు. తమకు ఇచ్చిన భూమి ఎందుకూ పనికి రాదని.. ఒప్పందానికి కట్టుబడకపోతే.. పరిహారం ఇవ్వాలని అశ్వనీదత్ కోర్టులో పిటిషన్ వేసారు.నిబంధనల ప్రకారం తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని.. ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పిటిషన్లో పార్టీలుగా ఆశ్వనీదత్ చేర్చారు. అశ్వనీదత్ లాగే్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా విడిగా తన పిటిషన్ వేశారు. ఆయన 31 ఎకరాలిచ్చారు. ఒప్పందం పక్కాగా ఉండటంతో … సాగదీయడమే మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.