ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం ఎలా? అనే విషయంలో చిత్రసీమ మల్లగుల్లాలు పడుతోంది. కరోనా భయం వెంటాడుతుండడంతో… జనాలు థియేటర్ల వరకూ వచ్చే పరిస్థితి లేదు. సినిమా అనేది వినోద సాధనమే కానీ, నిత్యావసర వస్తువు కాదు. పైగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. వినోదం అంతా అందులోనే దొరుకుతోంది. ఈ దశలో.. ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్ల బాట పట్టించాలంటే కష్టమే. దేశంలో కొన్ని మల్టీప్లెక్సులు తెరచుకున్నా, వాటికి కనీస ఆదాయం రావడం లేదు. త్వరలోనే తెలంగాణా లోనూ.. థియేటర్లకు అనుమతులు రాబోతున్నాయి.
డిసెంబరులో థియేటర్లు పూర్తిగా తెరచుకునే అవకాశం ఉంది. జనవరి లోగా కొత్త సినిమాలూ వచ్చేస్తాయి. సంక్రాంతికి అసలు సిసలైన హడావుడి మొదలవుతుంది. అయితే… కొత్త సినిమాలు చూడ్డానికి అయినా ప్రేక్షకులు వస్తారా, రారా అనే భయాలు పట్టుకున్నాయి. అందుకే ప్రేక్షకులకు సినిమాని, థియేటర్ వాతావరణాన్ని మళ్లీ అలవాటు చేయడంలో భాగంగా.. కొన్ని రోజుల పాటు సినిమాని ఉచితంగా ప్రదర్శించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కనీసం 2 వారాల పాటు.. తెలంగాణాలోని కొన్ని థియేటర్లలో సినిమాల్ని ఉచితంగా ప్రదర్శించాలని, టికెట్ లేకుండా ఎంట్రీ ఇవ్వాలని థియేటర్ యాజమాన్యం, పంపిణీదారులు భావిస్తున్నారు. ఇప్పుడు సినిమా వేసినా. పది మంది కంటే ఎక్కువ జనం రావడం లేదు. పది టికెట్లు తెగినా ఒకటే ఖర్చు, హౌస్ ఫుల్ అయినా ఒకటే ఖర్చు. అందుకే మొత్తంగా సినిమాని ఉచితంగా ప్రదర్శిస్తే… ఈ రూపంలో అయినా జనాలు థియేటర్లకు అలవాటు పడతారన్నది సినిమావాళ్ల నమ్మకం. త్వరలోనే తెలంగాణలో థియేటర్లు తెరచుకోబోతున్నాయి. ఈ సందర్భంగా వి, నిశ్శబ్దం, మిస్ ఇండియా లాంటి కొన్ని చిత్రాల్ని ఉచితంగా చూపించాలని భావిస్తున్నార్ట. మరి ఈ ప్రయోగం ఏమవుతుందో చూడాలి.