ఆర్నాబ్ గోస్వామికి మహారాష్ట్ర సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో ఆర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆయనకు బెయిల్ కూడా దక్కలేదు. వారం రోజులుగా జైల్లోనే ఉన్నారు. తాజాగా.. రిపబ్లిక్ టీవీకి చెందిన డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘనశ్యాం సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్పీ స్కాంలో ఆయనను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఓ వైపు ఆర్నాబ్ లేక రిపబ్లిక్ టీవీ సిబ్బంది టెన్షన్ పడుతూంటే.. చానల్ రోజువారీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే సింగ్ ను కూడా అరెస్ట్ చేయడం.. షాక్‌లా తగిలింది.
కొద్ది రోజుల క్రితం.. టీఆర్పీ స్కాంను ముంబై పోలీసులు బయట పెట్టారు. అప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత బార్క్ కూడా.. ఈ అక్రమాలను గుర్తించి.. టీఆర్పీ రేటింగ్‌లు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ కేసు కలకలం రేపింది. చివరికి వేరే రాష్ట్రంలో ఫిర్యాదు చేయించి.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే.. మహారాష్ట్ర సీబీఐకి జనరల్ కన్సెంట్ ను రద్దు చేసింది. టీఆర్పీ స్కామ్‌ను తామే దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో రిపబ్లిక్ టీవీనే పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. డిప్ట్రిబ్యూషన్ హెడ్‌ను అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర సర్కార్‌పై రిపబ్లిక్ టీవీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు పై లేనిపోని రచ్చ చేసింది. బాలీవుడ్ ప్రముఖులపై విస్తృతంగా రూమర్స్ ప్రచారం చేసింది. కంగనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇలాంటి సమయంలో శివసేన పత్రిక సామ్నా పలుమార్లు.. ముంబై ఇమేజ్ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. తేలిగ్గా తీసుకోబోమని స్పష్టం చేసింది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు.. పరిణాామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఈ విషయంలో ఆర్నాబ్‌కు.. రిపబ్లిక్ టీవీకి.. ఇతర మీడియా … రాజకీయవర్గాల నుంచి పెద్దగా సపోర్ట్ దక్కడం లేదు. ఒక్క బీజేపీ మాత్రమే సపోర్ట్ చేస్తోంది.