వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం అంతకంతకూ తగ్గిపోతోందనడానికి తాజా సూచనలు బహిరంగంగా వచ్చాయి. విశాఖలో ఇంత కాలం ఆయన మాటే వేదవాక్కు అన్నట్లుగా ఉన్న నేతలు ఇప్పుడు ఎదురు తిరగడం ప్రారంభించారు. ఓ అధికారిక సమావేశంలోనే కొంత మంది ఎమ్మెల్యేలు ఆయన తీరును సుతిమెత్తగా ఖండించారు. విజయసాయిరెడ్డి కూడా.. దానికి కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామం వైసీపీలో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఏదో జరుగుతోందన్న అభిప్రాయం పెరగుతోంది.
డీడీఆర్సీ సమావేశాలను ఎంపీ విజయసాయిరెడ్డి నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి ఆయన రాజ్యసభ సభ్యుడు మాత్రమే. విశాఖ నుంచి ఎంపిక కాలేదు. కానీ తన అడ్రస్ విశాఖ అని పెట్టుకున్నారు కాబట్టి.. అక్కడి ఎంపీ అని రికార్డుల్లోకి ఎక్కారు. అయితే వైసీపీలో తిరుగులేని అధికార కేంద్రంగా ఉండటంతో ఆయన మాటను ఎవరూ జవదాటేవారు కాదు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జ్గా ఆయన మొత్తం చిటికెన వేలు మీద నడుపుతూ ఉంటారు. సొంతంగా ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. అయితే అధికారిక సమావేశాలను.. నిర్వహిస్తూ ఉంటారు. అధికార యంత్రాన్ని మొత్తం పిలిపించి.. సమీక్షలు చేస్తూంటారు. ఇలా నిర్వహించిన ఓ సమావేశంలో .. సొంత పార్టీ నేతలు అవినితీకి పాల్పడుతున్నారని.. విశాఖలో జరుగుతున్న ఆక్రమణల వెనుక నేతలే ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు.
వైసీపీ నేతలపై ఇటీవలి కాలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపై కొంత మందికి చిర్రెత్తిపోయింది. ఎమ్మెల్యే ధర్మశ్రీ వెంటనే కౌంటర్ ఇచ్చారు. రాజకీయ నేతలు అంటూ.. అందర్నీ కలిపేయకుండా.. ఎవరెవరు అక్రమాలు చేశారో వారిపై చర్య తీసుకోవాలలని సవాల్ లాంటి సూచన ఇచ్చారు. అలాగే గుడివాడ ఎమ్మెల్యే కూడా వెనక్కి తగ్గలేదు. దీనికి విజయసాయిరెడ్డి కూడా సమాధానం ఇచ్చారు. నేతలకు కోర్టుకెళ్లే అర్హత లేదని చెప్పుకొచ్చారు. ఆవేశకావేశాలు లేకుండా.. విజయసాయిరెడ్డికి స్మూత్‌గా నేతలు ఎదురు చెప్పడంతోనే వైసీపీలో కలకలం ప్రారంభమయింది.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ … వైసీపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సింహాచలం భూములకు సంబంధించి నియమించిన ఓ కమిటీలో స్థానిక ఎపీ అయిన సత్యనారాయణను కాదని.. అనకాపల్లి ఎంపీని నియమించారు. దాంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తనను ఎవరూ ఎంపీగాలాగా ట్రీట్ చేయడం లేదని ఆయన ఫీలవుతున్నారు.
ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి మాటంటే.. మాటే అన్నట్లుగా ఉండేది. ఆయన ఏం చెబితే అది జరిగేది. ఉత్తరాంధ్రలో చిన్న మండలానికి ఎస్ఐను నియమించాలన్న ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితులే ఆయనపై తిరుగుబాటుకు కారణం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. పార్టీ హైకమాండ్ వద్ద పలుకుబడి తగ్గడం కూడామరో కారణం అంటున్నారు.