దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఎఫెక్ట్ టీఆర్ఎస్పై తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫలితం వచ్చిన ఒక్క రోజులోనే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చ ప్రారంభమయింది. పనితీరు ఆధారంగా మార్పుచేర్పులు ఉంటాయని ప్రగతి భవన్ నుంచి సంకేతాలు అందాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. గ్రేటర్ ఎన్నికలు కూడా వాటితో పాటే పూర్తవుతాయి. అవి పూర్తయిన తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దుబ్బాక ఫలితంగా కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. అధికార పార్టీ ఉపఎన్నికల్లో ఓడిపోతే.. తీవ్రమైన నెగెటివ్ వేవ్ ఉన్నదన్న సంకేతాలు వస్తాయని.. అది మంచిది కాదని ఆయన భావిస్తున్నారు.
మరో వైపు వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పార్టీ అభ్యర్థుల విజయం బాధ్యత ఆయా జిల్లాల మంత్రులదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గెలవకపోతే పదవులు ఉండవని నేరుగానే హెచ్చరికలు చేశారు. సీఎం హెచ్చరికల నేపథ్యంలో మంత్రులందరూ ఆరు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికల పనుల్లోనే ఉన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ విషయంలో హరీష్ రావు ఫెయిలయ్యారు. దుబ్బాక ఓటమికి తనదే బాధ్యతని ప్రకటించుకున్నారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశంపై తెలంగాణలో కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఇటీవల కొంత మంది మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. కరీంనగర్‌కు చెందిన ఓ మంత్రిపై.. టీఆర్ఎస్ అనుకూల మీడియా విస్తృతమైన కథనాలు ప్రసారం చేసింది. ఈటల రాజేందర్ పై కూడా గతంలో పదవి నుంచి తీసేస్తారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో అగిపోయారు. మంచి సమయం కోసం కేసీఆర్ చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు.. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ సమయం వస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.