మనసుల్ని కదిలించే కథలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఆ ఎమోషన్‌కు ఓ విలువ ఉంటుంది. గుండె తడిని గుర్తు చేసి, కంట తడి పెట్టిస్తే చాలు. ఆ కథల్ని కలకాలం గుర్తు పెట్టుకుంటాం. క్రిష్ అలాంటి కథలే చెప్పాడు. ఓ గమ్యం, ఓ వేదం, కంచె.. అన్నీ అలాంటి సినిమాలే. ఇప్పుడు క్రిష్ శిష్యురాలు సుజనా రావు కూడా అలాంటి కథే ఎంచుకుంది. `గమనం` ద్వారా.
మూడు జీవితాల ముడి ఈ `గమనం`. ఓ చెవిటి ఇల్లాలు, ఓ ప్రేమ జంట, మరో అనాథ. వీళ్ల ప్రయాణమే.. ఈ గమనం. భర్త దుబాయ్ వెళ్లిపోతే, అతని రాకకోసం కళ్లకు ఒత్తులు వెలిగించి చూస్తుంటుంది ఓ భార్య. తనకు వినపడదు.కానీ దేవుడంటే పరమ భక్తి. క్రికెటర్ కావాలని కలలు కంటుంటాడు ఓ కుర్రాడు. తనదో అందమైన ప్రేమకథ. ఓ అనాథ. తన పుట్టిన రోజు ఎప్పుడో తెలుసుకోవాలని, ఆ రోజున.. ఓ కేకు కట్ చేయాలని తాపత్రయపడుతుంటాడు. నగరంలో కురిసిన జడివాన.. ఈ జీవితాల్ని చల్లాచెదురు చేస్తుంది.మరి ఈ మూడు కథలకూ దర్శకురాలు ఎక్కడ, ఎలా ముడి కుదిరింది? అనేది ఆసక్తి కరం. బుర్రా సాయి మాధవ్ రాసిన సంభాషణలు మెరిశాయి. ఈ కథలోని ఆర్థ్రతని తెలియజేశాయి.
ఆ మబ్బులు చూడు.. ఎంత అందంగా ఉన్నాయో..?
ఎక్కడి వరకూ వెళ్తాయో వాటికే తెలీదు.
అలా వెళ్తూ వెళ్తూ వానై కరిగిపోతాయి.
ఒకటి వానైతే, ఇంకోటి ఒంటరిదైపోతుంది.
మర్యాదతో మమ్మల్ని మట్టితో కలుపుతావనుకుంటే
ఆ మర్యాదనే మట్టిలో కలిపేశావ్
నాకు వినపడకపోయినా గంట కొట్టి నీకు పూజ చేస్తున్నా
నీకూ వినపడదని నాకేం తెలుసు?
దేవుడు తడిసిపోయినాడని ఏడుత్తుండారా
ఆయన తయారు చేసిన బొమ్మలని ఆయనే ముంచేత్తుంటే… ఆయన తడిసిపోతున్నాడని ఏడుత్తుండారా? – లాంటి డైలాగులు బుర్రా కలం నుంచి జాలు వారాయి.
బలమైన సాంకేతిక నిపుణులు ఈకథకు దొరికారు. ముఖ్యంగా ఇళయరాజా నేపథ్య సంగీతం హృద్యంగా వినిపించింది. జ్ఞాన శేఖర్ కెమెరా పనితనం ఆకట్టుకునే అంశమే. శివ కందుకూరి, ప్రియాంక జవల్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. నిత్యమీనన్ అతిథిగా కనిపించబోతోంది. మంచి ఎమోషన్ దట్టించిన `గమనం` ట్రైలర్ వరకూ ఆకట్టుకుంది. మరి.. బాక్సాఫీసు ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.