రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా వారం రోజుల పాటు ఆయన మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్నారు. రిపబ్లిక్ టీవీకి ఇంటీరియర్ డిజైనింగ్ పని చేసిన వారికి డబ్బులు ఎగ్గొట్టడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఆర్నాబ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే అక్కడ ఆయన ఇతరుల ఫోన్ ఉపయోగించి.. సోషల్ మీడియా పోస్టులు చేయడంతో తలోజా జైలుకు తరలించారు. అక్కడ్నుంచే ఆయన బెయిల్ కోసం పోరాటం చేస్తున్నారు.
బెయిల్ ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించడంతో అర్ణబ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సుప్రీకోర్టు అర్ణబ్ సహా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని షరతులు విధించింది. ఆర్నాబ్ జైల్లో ఉండగానే…టీఆర్పీ స్కాంకు సంబంధించి రిపబ్లిక్ టీవీ డిస్ట్రిబ్యూషన్ హెడ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్నాబ్ ను అరెస్ట్ చేసినప్పటి నుండి రిపబ్లిక్ టీవీ మరో వార్తకు చాన్సివ్వకుండా… ఓ ఉద్యమాన్ని నడిపింది.
ఆర్నాబ్ ప్రాణాలకు ముప్పుందని.. ఆయనపై దాడి చేశారని .. ఆయనకు దేశం మొత్తం అండగా నిలిచిందని.. ఇలా రకరకాలుగా కథనాలు వేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో ఆర్నాబ్ మళ్లీ తన మార్క్ షోను రిపబ్లిక్ టీవీలో కంటిన్యూ చేయనున్నారు. దెబ్బతిన్న యాంకర్లా ఆయన మరింతగా మహారాష్ట్ర సర్కార్‌పై విరుచుకుపడే అవకాశం ఉంది.