చాలా కాలం తరవాత.. మోహన్‌బాబు నటించిన సినిమా `ఆకాశం నీ హద్దురా`. సూర్య హీరో, పైగా పలు భాషల్లో విడుదల అవుతుంది., ఇలాంటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో మోహన్‌బాబు కూడా కనిపిస్తారనుకున్నారంతా. ఈ కరోనా టైమ్ లో ప్రెస్ మీట్లూ, ఇంటర్వ్యూలూ తగ్గాయి గానీ, పూర్తిగా ఆగిపోలేదు. ఈ సినిమా ప్రచారానికి సూర్య, సుధాకొంగర ముందుకొచ్చారు. జూమ్ ద్వారా ఇంట్రాక్షన్ ఎలాగూ వుంది. అయితే.. వీటిలో ఎక్కడా మోహన్ బాబు కనిపించలేదు.
`ఆకాశం నీ హద్దురా`లో మోహన్‌బాబు ఉన్నాడని తెలిసినప్పటి నుంచీ ఆ పాత్రపై అన్నో, కొన్నో అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు. కానీ.. తీరా చూస్తే… ఈ సినిమాలో ఆయన్ని అతిథిని చేసేశారు. మూడంటే మూడే సన్నివేశాల్లో ఆయన తెరపైకొచ్చారు. ఎన్ని సన్నివేశాలన్నది పక్కన పెడితే, ఆ పాత్రని డిజైన్ చేసి, చూపించే విధానంపై పెద్దగా కసరత్తు చేయలేదనిపించింది. దానికి తోడు ఈ పాత్ర చేయడానికి మోహన్ బాబునే అవసరం లేదు. ఎవరైనా ఫర్వాలేదు. మోహన్ బాబు లాంటి ఆర్టిస్టుని తీసుకున్నప్పుడు ఆ పాత్రకు మరింత వెయిటేజీ ఇస్తే బాగుండేది. కనీసం తెలుగు ప్రేక్షకుల కోసమైనా అది చేయాల్సింది. అలా తన పాత్ర లేదని తెలిసే.. మోహన్ బాబు కూడా ఈ సినిమా ప్రచారానికి దూరంగా ఉన్నారేమో..? అమేజాన్‌లో విడుదలైన `ఆకాశం నీ హద్దురా`కి మంచి స్పందన వస్తోంది. మంచి సినిమా అని కితాబులు అందుతున్నాయి. కలక్షన్ కింగ్ పాత్రనీ సరిగా తీర్చిదిద్దితే తెలుగు ప్రేక్షకులు మరింత ఖుషీ అయ్యేవారు.