బిహార్‌లో ఎన్డీయే మెజార్టీ సాధించింది. ఎన్డీఏ అంటే.. బీహార్‌లో మొదటి పార్టీ జేడీయూ. తర్వాత బీజేపీ. కానీ బీజేపీ మెల్లగా జేడీయూని తగ్గిస్తూ… తాను పెరుగుతూ పోయింది. ఇప్పుడది పీక్స్‌కి చేరింది. ఎంతగా అంటే.. రెట్టింపు సీట్లు తెచ్చుకునేంత. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు సమంగా పోటీ చేసినా బీజేపీ 74 సీట్లు గెలిచింది. జేడీయూ ఖాతాలో పడింది 43 సీట్లే. అంటే జేడీయూ దారుణంగా దెబ్బతిన్నదన్నమాట. ఎన్నికలకు ముందు బీజేపీ నినాదం ప్రకారం.. ఇప్పుడు నితీశ్‌నే ముఖ్యమంత్రిని చేస్తారు. కానీ ఎంత కాలం అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ.
జేడీయూ దారుణంగా దెబ్బతినడంలో బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉంది. కూటమి నుంచి ఎల్జేపీని బయటకు పంపి.. ఒక్క జేడీయూ అభ్యర్థుల మీద మాత్రమే పోటీ చేయించడంలో బీజేపీ వ్యూహం ఉంది. వ్యూహాత్మక మౌనం పాటించి చిరాగ్‌ను ప్రోత్సహించారు. ఆరు శాతం ఓట్లు సాధించిన చిరాగ్… మొత్తం 59 స్థానాల విజయావకాశాలపై ప్రభావం చూపారు. నితీష్‌ను బలహీనపర్చడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇచ్చిన మాట ప్రకారం ఏడాది నుంచి రెండేళ్ల పాటు నితీశ్‌ను సీఎం సీటులో కూర్చోబెట్టి మరో ప్లాన్ నుఅమలు చేస్తారు. కేంద్రంలో పదవి ఇస్తామని ఆయనను దింపేస్తారు. తర్వాత బీజేపీ చేతుల్లోకి తీసుకుంటారు. ఇది అంచనా వేయడానికి పెద్ద పెద్ద విశ్లేషణలేం అవసరం లేదు.
అయితే… బీజేపీ తనను కొట్టిన దెబ్బపై నితీష్ రగిలిపోతున్నారు. బీజేపీని అంత కంటే ఎక్కువ దెబ్బకొట్టాలనుకుంటున్నారు. తనను సీఎం పదవి నుంచి దింపేసే ప్లాన్ బీజేపీ అమలు చేస్తే.. దానికి విరుగుడు కూడా సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. తనను సీఎం అభ్యర్థిగా కొనసాగిస్తేనే బీజేపీతో పొత్తు ఉంటుందని ఇప్పటికే నేరుగా ప్రకటించారు. ముందు ముందు కూడా ఇలాగే ఉంటుందంటారు. బీజేపీ తోక జాడిస్తే లాలూతో జట్టు కట్టేందుకు సిద్ధమని ఆయన సంకేతాలు పంపుతున్నారు. మొత్తానికి బీహార్ మార్క్ రాజకీయం ఐదేళ్ల పాటు సాగే అవకాశం ఉంది.