తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి దుబ్బాక దక్కిన విజయం జోష్లోనో… తెలంగాణ లో అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివేనని ప్రజల్ని నమ్మించామన్న ఆనందంలోనే కానీ… బీజేపీ నేతలు మరో అడుగు ముందుకేస్తున్నారు. తెలంగాణ చేస్తున్న అప్పుల క్రెడిట్ కూడా.. తీసేసుకుంటున్నారు. ఎలాగూ.. తెలంగాణ అమలు చేస్తున్న పెన్షన్ల పథకాల దగ్గర్నుంచి గొర్రెల పంపిణీ పథకాల వరకూ మొత్తం డబ్బు కేంద్రానిదేనని చెబుతున్నారు. ఇప్పుడు.. రుణం కూడా.. తెలంగాణకు కేంద్రం ఎక్కువే ఇస్తోందని కిషన్ రెడ్డి చెప్పడం ప్రారంభించారు.
కేంద్రం వద్ద ఎక్కువ రుణం తీసుకున్న రాష్ట్రం తెలంగాణనేనని.. కేంద్రం ఉదారంగా రుణసాయం చేస్తోందని కిషన్ రెడ్డి చెప్పుకచ్చారు. రుణాన్ని సాయంగా చెబుతూ.. కిషన్ రెడ్డి రాజకీయం చేయడానికి ప్రయత్నించారు కానీ.. తిరిగి కట్టనిది అయితే సాయం.. రుణం అయితే.. తిరిగి కట్టాల్సిందే. ప్రభుత్వాలు తీసుకున్న అప్పులు కట్టకపోవడం అనే సమస్య ఉండదు. పన్నుల ఆదాయాన్ని ఆర్బీఐ మినహాయించేసుకుంటుంది. అది కూడా సరిపోకపోతే దివాలా తీసినట్లుగా ప్రకటిస్తుంది. అయితే.. అప్పులు కూడా.. తెలంగాణ సర్కార్ నిబంధనల మేరకే తీసుకుంటుది.
నిబంధనలు అతిక్రమించి.. తెలంగాణకు ప్రత్యేకంగా రుణం తీసుకునే అవకాశం ఇస్తే అప్పుడు చెప్పుకోవచ్చు. అయినా తెలంగాణలో అప్పులపై విపక్షాలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ కూడా.. తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచెత్తారని ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే బీజేపీ నేతలు.. తాము కేసీఆర్కు భారీగా అప్పలిప్పించి మేలు చేశామని క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బూమరాంగ్ అయినా అవ్వొచ్చని ఇతర బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.