పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోడ్ని పోశమ్మ కొట్టిందని తెలంగాణ సామెత..!. దుబ్బాక ఉపఎన్నికల ఫలితం ఇదే నిరూపించింది. తెలంగాణలో తమకు ఎదురేలేదని.. తాము ఏం చెబితే అది నమ్మేస్తారని భ్రమపడి విర్రవీగిన నాయకులకు.. దుబ్బాక ఓటరు కళ్లు తెరిపించాడు. కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదని.. ప్రజాస్వామ్యంలో అహంకారం పనికి రాదని తేల్చేశారు. కాంగ్రెస్ను కాంగ్రెస్సె ఓడించుకుంటుందని గతంలో అనేవారు. ఆ పార్టీలో ఉండే గ్రూపు రాజకీయాల్ని బట్టి అలా అనేవారు. ఇప్పుడు అది అన్ని రాజకీయ అధికార పార్టీలకూ వర్తిస్తుంది. అధికారం మత్తులో అహంకారం పెరిగిపోయి.. ప్రజల కన్నా తామే మిన్నగా వ్యవహరించడం ప్రారంభిస్తున్నారు. చివరికిఅదే వారి పతనానికి కారణం అవుతోంది. దుబ్బాకలో జరిగింది అదే…!
టీఆర్ఎస్కి షాక్ ట్రీట్మెంట్ ప్రారంభించిన జనం..!
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఓ ప్రివిలేజ్ ఉంది. అదేమిటంటే.. ఏ సమస్య వచ్చినా.. దానికి జై తెలంగాణ అనే నినాదాన్ని జోడించడం. ప్రజల్లో ఉన్న ప్రాంతీయాభిమానాన్ని టీఆర్ఎస్ అలా ఉపయోగించుకుంది. అలా వచ్చిన బలాన్ని టీఆర్ఎస్ నేతలు మరో రకంగా ఉపయోగించుకోవడం ప్రారంభించారు. ప్రజల్ని తక్కువగా అంచనా వేయడం ప్రారంభించారు. అక్కడే అసలు సమస్య వచ్చింది. ప్రజలకే ఏవో రెండు పథకాలు పెట్టి.. ఎంతో కొంత సాయం చేస్తే.. వారే తర్వాత ఓటు వేస్తారని అనుకోవడం ప్రారంభించారు. అక్కడే పతనం ప్రారంభమయింది. సాధారణంగా ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ… ఉపఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోదు. దానికి నిదర్శనంగా… నంద్యాల ఉపఎన్నికను చెప్పుకోవచ్చు. సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరపరాజయాన్ని చవి చూసింది. కానీ అంతకు ముందు జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో సిట్టింగ్ సీటు కాకపోయినప్పటికీ 20వేల మెజార్టీ సాధించింది. దీనికి కారణం.. ఆ స్థానంలో అధికార పార్టీ ఓడిపోయినప్పటికీ.. రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి.. తమకు అందే ప్రభుత్వ ప్రజా ప్రయోజనాలు అందవేమోనన్న ఆందోళనతో ఆ పార్టీకే్ మద్దతిస్తారు. ఒక్క నంద్యాలలోనే కాదు.. .. దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో అదే ట్రెండ్ కనిపిచింది. కానీ దుబ్బాకలో మాత్రమే ఫలితం తేడా కొట్టింది.అంటే… ప్రజలు కారుపార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకోవడమే.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ఉన్నతులు..! కానీ అధికార పార్టీ నేతలేం చేస్తున్నారు..!?
ఒక్క సారి అధికారం అందితే.. ప్రజలు తమకు పెత్తనం చేయడానికి అధికారం ఇచ్చారని.. ఏమైనా చేయవచ్చనుకునే తాజా అధికారవాదుల వల్లనే… సమస్య వస్తోంది. టీఆర్ఎస్ మొదట అధికారం చేపట్టినప్పుడు … తెలంగాణ కోసం పోరాడారన్న భావన ఉండేది. వారు ఏం చేసినా తెలంగాణ కోసమే చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉండేది. అందుకే్ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసేవారు. అందుకే పాలేరు లాంటి నియోజకవర్గాల ఉపఎన్నికలలో వేలకు వేల మెజార్టీ వచ్చింది. కానీ తెలంగాణ ప్రజల మద్దతును టీఆర్ఎస్ నేతలు అలుసుగా తీసుకున్నారు. ప్రజల్ని తక్కువగా అంచనా వేయడం ప్రారంభించారు. అధికారం కోసం అన్ని పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్ని అవమానించడం ప్రారంభించారు. తాము ఏం చేసినా.. చేయకపోయినా.. చివరికి జై తెలంగాణ అంటే ఓట్లేస్తార్నన ధీమా వారిలో కనిపిస్తోంది. ఫలితంగా చోటామోటా నేతల దగ్గర్నుంచి పై స్థాయి వరకూ ఎవరికీ.. ప్రజలంటే గౌరవం లేకుండా పోయింది. ప్రజలు ఇతర పార్టీల నేతల పట్ల అహంకారం.. , మనిషిని మనిషిగా గౌరవించని కుసంస్కారం. ఏం చేసినా చెల్లుతుందన్న దురహంకారం.. ఆ పార్టీ నేతల్లో పెరిగిపోయాయి. ప్రజలు అన్నింటినీ బేరీజు వేసుకుంటారు. తీర్పు చెప్పే సమయం వచ్చినప్పుడు నిర్ణయం ప్రకటిస్తారు. అప్పుడు కానీ తాము చేసిన తప్పేమిటో తెలుసుకోలేరు.
ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయం లేకుండా చేసుకోవడం సాధ్యమా..!?
ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయం ఉండకుండా చేసుకోవడం అసాధ్యం. అలా అనుకుంటే.. అంతకు మించిన అహంకారం ఉండదు. కానీ టీఆర్ఎస్ అదే చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వలసల్ని ప్రోత్సహించి ఆ పార్టీని నిర్వీర్యం చేయడానికి టీఆర్ఎస్ హైకమాండ్ తన అధికారాన్ని .. శక్తిని ధారబోసింది. కానీ ఇప్పుడేమయింది. బీజేపీ ప్రత్యామ్నాయంగా వచ్చింది. బీజేపీ కాకపోతే.. ఇంకో పార్టీ వస్తుంది. ఇక్కడ ప్రత్యామ్నాయం ప్రజలు సృష్టించుకుంటారు. ఎందుకంటే.. వారి చేతుల్లో ఓటు అనే ఆయుధం ఉంది. ఎవరూ దిక్కు లేదు.. మాకు మాత్రమే ఓటేయాలన్న పరిస్థితి ఎవరైనా సృష్టించగలమని అనుకుంటే.. అది అమాయకత్వమే. అది చివరికి.. పరాజయాన్ని మరంత దగ్గరకు తెస్తుంది. ఇది టీఆర్ఎస్కు ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. కాంగ్రెస్ పార్టీని తగ్గించి.. బీజేపీని పెంచారు తప్ప.. తనకు ఎదురు లేకుండా మాత్రం చేసుకోలేదు. ఆ విషయం దుబ్బాకతో క్లారిటీ వచ్చింది. ఒక్క సారి … బీజేపీ ఎదగడం ప్రారంభిస్తే.. ఎంత ప్రమాదకరమో.. టీఆర్ఎస్కు.. ఆ పార్టీ అధినేతకు.. త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
తప్పులు ఎత్తి చూపినా సహించలేనితనంతో నష్టపోయారు..!
తెలంగాణలో ఇప్పుడు నిఖార్సైన ప్రతిపక్షం ఉందా..? రాజకీయ పార్టీలు అధికార పార్టీని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాయి. వారి పోరాటం వారిది. కానీ.. ప్రభుత్వానికి మీడియా ఎప్పుడూ విపక్షంగానే ఉండాలి. వారే … తప్పులు పక్కాగా ఎత్తి చూపుతారు. ప్రజల కష్టాలను చెబుతారు. కానీ అలా ఎత్తి చూపేవారిని పక్క పార్టీ మద్దతు దారులుగా భావించి.. అసలు ప్రజలకు కష్టాలే లేవనుకునే ఆలోచన స్థాయికి వెళ్లిపోయారు టీఆర్ఎస్ నేతలు. చివరికి.. ఎలాంటి వ్యతిరేక వార్తలు వచ్చినా సహించలేని పరిస్థితికి వచ్చారు. మీడియాపై దాడులకు తెగబడ్డారు. కొన్ని చానళ్లను నిలిపివేశారు. చివరికి అగ్రశ్రేణి దినపత్రికలు సైతం.. ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రజల కష్టాలను వెలుగులోకి తేవడానికి సంకోచిస్తున్నాయి. ఫలితంగా.. ప్రభుత్వానకీ అసలు నిజం ఏమిటో తెలియని పరిస్థితి. రాజకీయ పార్టీల నేతలు చెప్పట్లేదు.. మీడియాను బయట పెట్టనీయడం లేదు కాబట్టి.. అంతా బాగుందని ప్రభుత్వం అనుకుంది. కానీ ఆ పరిస్థితి నిప్పుల మీద దుప్పటి వేయడమేనని.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దుబ్బాక ఎన్నికల ఫలితమే నిరూపించింది. తమను ఎవరూ విమర్శించకూడదు.. తప్పులు ఎత్తి చూపకూడదనే అహంకారం.. అంతిమంగా చేటు తెచ్చింది.
ఇప్పటికీ తప్పులు గుర్తించకపోతే దుబ్బాకలే ఎదురొస్తాయి..!
దుబ్బాకలో తెలంగాణరాష్ట్ర సమితి ఓటమిని ఓ నియోజకవర్గ ప్రజల అభిప్రాయంగా మాత్రమే తీసి పడేయాల్సిన అవసరం లేదు. విస్తృతంగా తీసుకోవచ్చు. ఎప్పుడూ గెలవని హుజూర్ నగర్లో తిరుగులేని గెలుపు సాధించిన టీఆర్ఎస్.. కంచుకోట దుబ్బాకలో మాత్రం ఎందురు పరాజయం పాలైంది..? తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని, కార్యకర్తలను విస్మరించడడం.. పార్టీలో డబ్బున్నోళ్లకే ప్రాధాన్యమివ్వడం.. నేల విడిచి సాము చేయడం.. వంటి చాలా కారణాలు కనిపిస్తాయి. ఇలాంటివి చెప్పినప్పుడు.. అధికారంలో ఉన్న వారికి కోపం వస్తుంది. కానీ సరి చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా.. అధికార పార్టీ నేతలు.. తప్పుల్ని గుర్తించి దిద్దుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు.
ఒక్క టీఆర్ఎస్కే కాదు.. అధికార పార్టీలన్నింటికీ దుబ్బాక గుణపాఠమే..!
ప్రస్తుతం రాజకీయాలు మారిపోయాయి. ఓటర్లు తమ సమస్యల కన్నా.. ప్రాంతం, కులం, మతం అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అలా ఇచ్చేలా రాజకీయ పార్టీలు చేస్ున్నాయి. అలా ప్రజల్ని భావోద్వేగానికి గురి చేసి.. గెలిచేసి… అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని ఆ ఉద్వేగంలో ఉంచి.. సొంత పనులు చేయడం.. కక్ష సాధింపులకు పాల్పడటం.. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి పనులకు పాల్పడుతున్నారు. పోలీసుల్ని.. ఇతర అధికారాన్ని అండగా పెట్టుకుని సామాన్యుల్ని కూడా బెదిరిస్తున్నారు. అధికార మత్తులో తాము ఎంత తప్పు చేస్తున్నామో గ్రహించలేకపోతున్నారు. తమకు అధికారం శాశ్వతంగా ఉంటుందని అనుకుంటున్నానారు. కానీ.. వారిని ఓటమి.. ఒక్క ఓటు దూరంలో ఉంటుందని అంచనా వేయనంత అహంకారం కమ్మేస్తోంది. అలాంటి పాలకులందరికీ.. దుబ్బాక.. ఓ గుణపాఠం. నేర్చుకున్నవారు బాగుపడతారు.. లేని వారు.. చేతులు కాలే వరకూ అదే పద్దతిలో ఉంటారు.