బయోపిక్లకంటూ.. ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. మహనీయుల చరిత్ర ఇప్పుడు కమర్షియల్ పాయింట్. అందుకే కుప్పలు తెప్పలుగా బయోపిక్‌లు వస్తూనే ఉన్నాయి. దివంతగ దర్శకుడు దాసరి నారాయణరావు కథలో కూడా మంచి సినిమా అయ్యే సరుకుంది. అందుకే.. ఆమధ్య దర్శకుడు మారుతి కూడా…. `దాసరి బయోపిక్ తీయాలనివుంది.. ఎప్పటికైనా తీస్తా` అనిప్రకటించారు.
అయితే ఆయనకంటే ముందే టాలీవుడ్ లో దాసరి బయోపిక్ పై కసరత్తులు మొదలైపోయాయి. దాసరికి అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత దాసరి బయోపిక్ పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. ఓ దర్శకుడితో.. దాసరి కథ స్క్రిప్టుగా రాయిస్తున్నారని సమాచారం. మరోవైపు దాసరి కుమారుడు అరుణ్ కుమార్ కూడా దాసరి పద్మ పేరుతో తండ్రి కథని సినిమాగా తీయాలని భావిస్తున్నార్ట. మొత్తానికి దాసరి కథపై ముక్కోణపు పోటీ మొదలైంది. ఎవరు ముందడుగు వేస్తే… వాళ్ల ప్రాజెక్టుకే క్రేజ్. మరి.. ఆ ఛాన్స్ ఎవరు తీసుకుంటారో చూడాలి.